Telangana

Unemployed : నిరుద్యోగులకు అభయహస్తమేదీ.? చావులు ఆగొద్దా.?

Unemployed Open letter to government on jobs

Unemployed Open letter to government on jobs : గత ప్రభుత్వంపై మాయని మచ్చలా మిగిలిపోయాయి నిరుద్యోగుల ఆత్మహత్యలు. నోటిఫికేషన్ల వాయిదాలు, పేపర్ లీకేజీల కారణంగా జరిగిన ఆత్మహత్యలు ప్రభుత్వంపై  యువతలో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. అది ఎన్నికల ఫలితాల్లోనూ ప్రస్పుటంగా కనిపించింది.

కానీ నిరుద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో గెలిచి, వారి కష్టాలు తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొదటి కేబినెట్ లోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఎన్నికల ముందు చెప్పింది. కానీ ఇప్పటికి రెండు మూడుకేబినెట్ భేటీలు అయినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి పది రోజులు అవుతోంది. ఇది చాలా తక్కువ సమయం. అప్పుడే ఉద్యోగాలు ఇవ్వలేరు. నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ముందు ఉద్యోగ ఖాళీల (Unemployed) లెక్కలు తీయాలి. భర్తీకి నిర్ణయం తీసుకోవాలి.. దానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలి. ఇదంతా వ్యవహారం అయ్యే సరికి ఏ ఆరునెలలో అవుతుంది. కాబట్టి ఇప్పుడే మీరు ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితి లేదు.

Unemployed Open letter to government on jobs 1

కానీ మళ్లీ నిరుద్యోగుల (Unemployed) ఆత్మహత్యలనే మాట వినబడుతోంది. పాలకులు మారినా మా రాత మారదా అంటూ నిరుద్యోగులు ఆందోళన చెందుతుతున్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలే తప్పా.. ఉద్యోగాల భర్తీపై ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఏమీ రాలేదు. కారుతో యువత జీవితాలు బేకార్ అయ్యాయని మీరే చెప్పారు. మరి మీ హస్తం వచ్చాక కూడా ఎందుకు అభయహస్తం కాలేకపోతోంది. భస్మాసురహస్తం అనే గత పేరునే నిలుపుకుంటారా.?

ప్రభుత్వం కుదురుకోవడానికి సమయం కావాలి. కానీ అప్పటి దాకా అయినా యువతకు భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. కేబినెట్ అంతా కూర్చుని మీడియా సమావేశం పెట్టి ఫలానా రోజు నుంచి ఉద్యోగాల ప్రక్రియ ఖచ్చితంగా మొదలుపెడతాం. యువత ఆందోళన చెందవద్దు అని చెప్పవచ్చు కదా. ఆ దిశగా ఏమైనా ఆలోచన చేయొచ్చు కదా.

గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విఫలమైందని, యువత ప్రాణాలు తీసిందని గొంతెత్తిన మేధావి వర్గం ఇప్పుడు ఎక్కడా చడీచప్పుడు కూడా చేయడం లేదు. ఎందుకని.? అంటే మీరు పనిచేసింది ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశంతోనా..? లేకపోతే యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనా..?

ఆ మేధావి వర్గానికి వెంట నడిచి ప్రజాగొంతుకలమని, గొంతులు చించుకున్న మీడియా ఎక్కడపోయింది. టీవీల్లో, యూట్యూబు ఛానళ్లలో నిరుద్యోగుల గోసల మీద, ఆత్మహత్య మీద ఎందుకు లైవ్ లు కనిపించడం లేదు. ప్రజల పక్షం అన్నప్పుడు అలాగే ఉండాలి కానీ.. ప్రభుత్వం మారగానే మీరు మీ దుకాణాలు సర్దేస్తే ఎలా..?

గత పాలకులు పనికిమాలినోళ్లు అని ప్రచారం చేశారు.

కొత్త ప్రభుత్వం వచ్చింది.

మరి ఈ పాలకులు పనిమంతులు.. ఉద్యోగాలిస్తారు ప్రాణాలు తీసుకోవద్దని ఎందుకు వారికి చెప్పలేకపోతున్నారు. మీరైనా ఆ యువతకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు.

కొత్త ప్రభుత్వం వచ్చాక పోయింది ఒకటే ప్రాణం కదా..

దానికే ఇంత ఆగమాగం ఎందుకని ప్రశ్నించవచ్చు. కానీ ఇది మరెన్ని మరణాలకు కారణమవుతుందోననే బెంగ మాత్రమే.

రాజకీయాల కోసం యువత ప్రాణాలతో మరోసారి చెలగాటం ఆడొద్దు.

Read Also :