Panjagutta police station staff transferred : పోలీసు శాఖ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంటున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ సీపీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. చరిత్రలోనే ఇలాంటి ఘటన మొదటిసారి జరిగినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta police) లోని సిబ్బంది మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందర్నీ బదిలీ చేశారు. అయితే.. వీరిని వేరే స్టేషన్ కు బదిలీ చేయకుండా ఏఆర్ కు అటాచ్ చేయడం మరింత సంచలనంగా మారింది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta police) లో దాదాపు 86 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఏఆర్(ఆర్మ్డ్ రిజర్వ్) విభాగానికి అటాచ్ అయ్యారు. సాధారణంగా అయితే ఏవైనా ఆరోపణలు వస్తే ఒకరిద్దరిని వేరేచోటికి పంపించడం, లేకపోతే వీఆర్ లో పెట్టడం సాధారణమే. కానీ ఈ సారి ఏకంగా స్టేషన్ స్టాఫ్ మొత్తాన్ని ఏఆర్ కు అటాచ్ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.
ఇటీవల బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ వ్యవహారంలో పంజాగుట్ట స్టేషన్ లో పనిచేస్తున్న అధికారుల మీదే వేటు పడింది. ఇప్పుడు మొత్తం సిబ్బందిపైనా వేటు పడింది.
గతంలో భవనం, సేవల విషయంలో ఈ పీఎస్ కు అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కానీ ఇప్పుడు ఇలా జరిగి మరోసారి హాట్ టాపిక్ గా మారింది.