Telangana

V6 Vivek : విచారంలో V6 వెలుగు ఓనర్ MLA వివేక్..!

V6 vivek disappoint over post

V6 vivek disappoint over post : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పదవుల కుమ్ములాటలు మొదలయ్యాయి. పదవుల కోసం నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోందని సమాచారం. ఇప్పటికే మంత్రి పదవుల విషయంలో చాలామంది కాంగ్రెస్ పాత నాయకులు, సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు మరికొందరు అదే అసంతృప్తి శిబిరంలో చేరిపోయారనే టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి తన మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించిన వివేక్ బ్రదర్స్ కు (V6 vivek) కేబినెట్ లో చోటు దక్కలేదు. తమకు ఖచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని ఇద్దరు చాలా ఆశగా ఎదురుచూశారు. గతంలో తాము పార్టీలో ఉన్నవాళ్లం. ఇప్పుడు మళ్లీ వచ్చి గెలిచాం. అంతకుమించి తమ మీడియా సంస్థలైన వీ6, వెలుగు పత్రికను ఎన్నికల సమయంలో పార్టీకోసం ధారపోశాం. కాబట్టి ఇద్దరికి, లేకపోతే తనకు మంత్రి పదవి పక్కా అనుకున్నారట వీ6 ఓనర్ వివేక్ వెంకటస్వామి.

కానీ అనూహ్యంగా కేబినెట్ లో వినోద్, వివేక్(V6 vivek) ఇద్దరిలో ఒకరికి కూడా చోటు దక్కలేదు. అయితే మరో 8 మందిని కేబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉండటంతో తర్వాత ఇస్తారని ఊరుకున్నారట. ఇంతలోనే పార్టీకి విప్ లను ప్రకటించారు. కానీ చీఫ్ విప్ ను ప్రకటించకుండానే కేవలం విప్ ల వరకే ప్రకటించి ఊరుకున్నారు. దీనికి కారణం వేరే ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విప్ లను నియమించే సమయంలో చీఫ్ విప్ పదవి ఎవరికి ఇవ్వాలనే చర్చ జరిగిందట. ఈ సమయంలో వివేక్ వెంకటస్వామి పేరు ప్రస్తావనకు వచ్చిందట. దాదాపుగా కేబినెట్ ర్యాంకు స్థాయి పదవి కాబట్టి ఆయన శాటిస్ఫై అవుతారని అంతా భావించారట. కానీ వివేక్ మాత్రం ససేమిరా అన్నారని సమాచారం.

విప్ పదవికి మీరు మాత్రమే న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి సహా, కొందరు రేవంత్ వర్గం మంత్రులు అన్నారట. దీనిపై స్పందించిన వివేక్ న్యాయం చేయడం కాదు.. నేను అన్యాయమైపోతాను అని అన్నట్టు తెలుస్తోంది.

ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి లేకపోతే.. ఎమ్మెల్యేగానే ఉంటా నాకు ఏ పదవులు వద్దని తెగేసి చెప్పారట. నా స్థాయి ఏంటీ..? నేను చేసిన పని ఏంటీ.? ఇవన్నీ పట్టించుకోరా.? కనీసం డిప్యూటీ సీఎం ఇస్తారనుకుంటే అదీ ఇవ్వలేదు. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇవ్వరా.? అని అసహనం వ్యక్తం చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే.. కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై మాత్రం ఆయన అసహనంతో ఉన్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. కేబినెట్ విస్తరణలో చోటు కల్పించకపోతే కొట్లాడుడేనని సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది.

Read Also :