National

Dhiraj Sahu : ఈ సాహు మామూలోడు కాదు.. చుక్క చుక్కలోంచి..!

Dhiraj Sahu IT raids 335 crores counted till now

Dhiraj Sahu IT raids 335 crores counted till now : రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బీరువాల నిండా నోట్ల కట్టలున్న ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. సర్కారు ఆఫీసులో ఫైళ్లు కట్టగట్టి పెట్టిన స్టోర్ లాగా అందులో నోట్లు కట్టలు కట్టి పెట్టారు. ఈ నెల ఆరో తేదీ నుంచి ఆ కట్టల లెక్కలు తేల్చేందుకు ఇన్ కం ట్యాక్స్ అధికారులు కుస్తీ పడుతున్నారు.

అధికారులే కాదు.. మెషిన్లు కూడా ఆ నోట్ల కట్టలు లెక్కపెట్టలేక అలసిపోతున్నాయట. హీటెక్కి మొరాయిస్తున్నాయట. అన్నీ 500 నోట్ల కట్టలే. అప్పుడప్పుడు కొన్ని 200 నోట్ల కట్టలు కనిపిస్తున్నాయట. అక్షయ పాత్ర మాదిరి తీస్తున్నా కొద్ది బయటకు వస్తూనే ఉన్నాయట. దీంతో ఆరు రోజులైనా లెక్కలు ఇంకా ఎటూ తేలలేదు. ఇప్పటి వరకు అధికారులు, మెషిన్లు తిప్పలు పడి లెక్క పెట్టింది రూ.335 కోట్లు. మిగిలిన కట్టల లెక్క ఇంకా తేలాల్సి ఉంది.

అయితే.. దేశంలోనే ఇన్ కం ట్యాక్స్ రెయిడ్స్ లో పట్టుబడిన అత్యధిక మొత్తం ఇదేనట. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ స్థాయిలో నగదు పట్టుబడలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఇలాంటి వాటికి అవకాశం ఉంటే.. ఈ కట్టల గుట్టలు ఖచ్చితంగా అందుకు అర్హమైనవే.

మరి ఈ కట్టలన్నీ ఎలా వచ్చాయి.? మెషిన్ పెట్టి ఏమైనా ప్రింట్ చేశారా..? అనుకోకండి. పాపం అలా ఏం చేయలేదు.

ఇవన్నీ జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు (Dhiraj Sahu) కుటుంబానికి చెందినవి.

ఎంత ఎంపీ అయితే మాత్రం ఇంతలా సంపాదిస్తాడా.? అనే ప్రశ్న రావొచ్చు.

అసలు విషయం ఏంటంటే ఈ ఎంపీకి లిక్కర్ బిజినెస్ ఉంది. ఒడిశాలో బౌధ్ పేరుతో డిస్టిలరీలు ఉన్నాయి.

అరె.. మందు తయారు చేసి, అమ్మినంత మాత్రానా ఇన్ని గుట్టల కట్టలు ఎలా వచ్చాయి.? అనే మరో ప్రశ్న కూడా రావొచ్చు.

Dhiraj Sahu IT raids 335 crores counted till now 1

డిస్టిలరీల్లో తయారుచేసిన మందు, దాన్ని బయటకు అమ్మిన మందు లెక్కలన్నీ రాసిపెట్టాలి. ఇన్ కం ట్యాక్స్ లు వేరే పన్నులేమైనా ఉంటే కట్టాలి. కానీ ఈ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు (Dhiraj Sahu)మాత్రం చాలా తెలివిగా వ్యవహరించాడు. లెక్కలో చూపించినప్పుడు కదా ట్యాక్స్ కట్టాలి. సో.. అసలు లెక్కలో చూపెట్టకపోతే అయిపోతుంది కదా అనుకున్నాడు. ఫ్యాక్టరీ మనదే, అమ్మేది మనవాళ్లే.

ఇంకేముంది రాత్రీ పగలూ, వర్కింగ్ డే హాలిడే అని లేకుండా ఇష్టారాజ్యంగా చీప్ లిక్కర్ తయారు చేసి.. లెక్కాపత్రం లేకుండా అమ్మేసి.. వచ్చిన డబ్బునంతా ఇలా గుట్టలు గుట్టలుగా పేర్చాడు. లైసెన్స్ ఫ్యాక్టరీలో లెక్కాపత్రం లేని మందు తయారు చేసి డబ్బు సంపాదించొచ్చని లాజిక్ ను ఫాలో అయ్యాడు.

కానీ ఇలా అక్రమంగా కూడబెడితే ఏదో ఒక రోజు ఐటీకి దొరికిపోతామని మాత్రం గుర్తించలేకపోయాడు. అందునా కేంద్రంలో మోడీ, అమిషా లు ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన తాను ఎలా ఇదంతా చేద్దామనుకున్నాడో మరి. ఏమైనా పంపకాల దగ్గర తేడాలొచ్చాయో.. ఏంటో గానీ.. మొత్తంగా ఇన్ కం ట్యాక్స్ చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు.

ఇంత జరుగుతోంటే బీజేపీ వాళ్లు ఊరుకుంటారా.? కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అనేది మరోసారి రుజువైందని దుమ్మెత్తిపోస్తున్నారు.