Revanth Reddy meeting with leaders : కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అందుకే ఎప్పుడూ కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూనే ఉంటారు. చివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే దుమ్మెత్తిపోస్తూ అదే పార్టీలో ఉంటారు. ఈ స్థాయిలో అక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇన్ని రోజులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పెద్దగా మెజారిటీ లేదు. ఒక్క ఐదారుగురు అటీటు కాలు కదిపినా సర్కారు కూలిపోయే పరిస్థితి. దీనికి తోడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్ కావడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. దీనిమీద మొదట్నుంచి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మమ్మల్ని కాదని అన్నీ కొత్తగ వచ్చినోడికే ఎలా ఇస్తారని బహిరంగంగానే తిట్టుకున్నది కూడా మనం చూశాం. పీసీసీ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు.
అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినా అంసతృప్తులు మాత్రం ఆగడం లేదు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ టికెట్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎవరీ మాటా పెద్దగా వినరనే పేరుంది. దీంతో చాలామంది ఆగ్రహంతో ఉన్నారట. కానీ తాను ముఖ్యమంత్రి పదవిలో పూర్తి కాలం కొనసాగాలంటే ఏదో ఓ మెట్టు దిగకతప్పదని రేవంత్ భావించినట్టు తెలుస్తోంది.
రెబల్ గా మారే అవకాశం ఉన్న నేతలతో రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల జగ్గారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారట. ఎంపీ టికెట్ కావాలని అడిగినా.. అది తన చేతుల్లో లేదని చెప్పడంతో జగ్గారెడ్డి ఏకంగా ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం పెద్దలతోనే తేల్చుకుంటానని చెప్పారట.
అలాగే మిగతా అసంతృప్త నేతలతోనూ రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు వేరు కుంపట్లు మొదలైతే పరిస్థితి దారుణంగా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.