Mudiraj community not voted to BRS : పదవుల్లో ఉన్నప్పుడు ఒకలా.. పదవులు దిగిపోగానే మరోలా మాట్లాడటం రాజకీయాల్లో ప్రస్తుతం సర్వసాధారణం అయ్యింది. అయితే.. ఒక పార్టీలో ఉన్నప్పుడు తమ సామాజిక వర్గానికి నాయకత్వం వహించిన వాళ్లే ఆ తర్వాత ప్లేటు ఫిరాయిస్తున్నారు. అధికారానికి దూరం కాగానే అసలు గత ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి ఏం చేయలేదని విమర్శలు చేస్తున్నారు.
తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ముదిరాజ్ లకు టికెట్లు ఇవ్వలేదనే అపవాదు ఉంది. కానీ నామినేటెడ్ పదవులతో అంతకుముందే కొంతమందిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి (Mudiraj community)చెందిన బండ ప్రకాశ్ ను రాజ్యసభకు పంపారు. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మండలి డిప్యూటీ చైర్మన్ ని చేశారు. అలాగే నామినేటెడ్ పదవులైన కార్పొరేషన్ పదవులు ఇతరత్రా పదవుల్లో వారికి ప్రాధాన్యత కల్పించామని బీఆర్ఎస్ చెప్పుకుంది.
కానీ ఇదే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ కార్పొరేషన్ చైర్మన్ గానూ పనిచేశారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలోనూ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో టర్మ్ లో ఆయనకు తెలంగాణ రాష్ట్ర మత్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా బాధ్యతలు ఇచ్చింది. ప్రభుత్వం మారే సమయంలో కూడా ఆయన అదే పోస్ట్ లో ఉన్నారు.
కానీ ఇలా ప్రభుత్వం మారిందో లేదో.. ఆయన పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్ సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు. వారికి ఏం లాభం చేయలేదన్నట్టుగా ఓ దినపత్రికలో ఎడిటోరియల్ పేజీలో వ్యాసం రాశారు. అందుకే ముదిరాజ్ లు ఎవరూ కూడా బీఆర్ఎస్ కు ఓటు వేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఆయన చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ లకు ఏమీ చేయలేదు. ముదిరాజ్(Mudiraj community) లు బీఆర్ఎస్ కు ఓటు వేయలేదనేది ఎంత వరకు నిజం..?
చేపపిల్లలు ఇచ్చింది నిజం కాదా.? చేపలు అమ్ముకోవడానికి ఫోర్ వీలర్లు, టూవీలర్లు ఇచ్చింది నిజం కాదా.? మత్స్య సంపద పెరిగింది నిజం కాదా.? ముదిరాజ్ లు ఆర్థికంగా నిలదొక్కుకున్నది నిజం కాదా.? ఇవన్నీ జరిగాయి కాబట్టే ముదిరాజ్ లు చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు.
రాష్ట్రంలో దాదాపు 60 లక్షల వరకు ముదిరాజ్ జనాభా ఉంది. వీళ్లెవ్వరూ బీఆర్ఎస్ కు ఓటేయకుంటే గెలిచిన పార్టీకి, ఓడిన బీఆర్ఎస్ కు ఓట్ల తేడా కేవలం 2 శాతమే ఎలా ఉంది.? మిగతా పార్టీల్లో ముదిరాజ్ లకు వచ్చిన టికెట్లు ఎన్ని..? ఎంత మంది ముదిరాజ్ ఓటర్లు వారి పక్షాన నిలిచారు అనేది కూడా లెక్కలు వేసుకోవాలి కదా.
అనేది కూడా వివరించాలి కదా. ఒక సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ఉన్నప్పుడు గ్రౌండ్ లెవల్లో ఉన్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి ఉండొచ్చు. న్యాయం జరగలేదని భావిస్తే అప్పుడే పదవి నుంచి తప్పుకుని ఉండొచ్చు. కానీ పదవులు అనుభవించి ఆ తర్వాత విమర్శలు, ఆరోపణలు చేయడం బావిలో ఉన్నోడి మీద రాళ్లేయడమే అవుతుంది. ఇప్పుడు కూడా పదవుల ఆశతోనే అలా చేస్తున్నారేమోననే భావన ప్రజల్లో కలుగుతుంది.