Allu Arvind:అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ నోటీసు

Allu Arvind:జూబ్లీహిల్స్ రోడ్ నం.45లోని అల్లు బిజినెస్ పార్క్‌పై జీహెచ్ఎంసీ అధికారులు షాకింగ్ చర్యలు చేపట్టారు. హీరో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ అక్రమ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అసలు పర్మిషన్ ప్రకారం నాలుగు అంతస్తులకే అనుమతి ఇచ్చినా, అదనంగా ఒక ఫ్లోర్ పెంట్‌హౌస్ నిర్మించారని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం గుర్తించింది. దీంతో ఆ పెంట్‌హౌస్‌ను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని అల్లు అరవింద్‌ను నోటీసులో ఆదేశించారు.

గతేడాది, అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ బిజినెస్ పార్క్‌ను నిర్మించిన అల్లు ఫ్యామిలీకి జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది. గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి ఫ్యామిలీ వ్యాపారాలు, సినీ కార్యకలాపాలు ఈ భవనం నుంచే నిర్వహిస్తున్నారు. కానీ తాజాగా అనుమతులు లేకుండా పెంట్‌హౌస్ నిర్మించడం వివాదాస్పదమైంది.

ఇక గత కొంతకాలంగా అల్లు కుటుంబం వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటీవల అల్లు అర్జున్ ఓ ఈవెంట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి విమర్శలకు గురయ్యారు. అదే సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన అరెస్టై జైలుకి వెళ్లారు. ఈ సంఘటనలు ఇంకా చర్చలో ఉండగానే, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకమ్మ మృతి చెందడం కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. ఆ బాధ నుంచి కోలుకోక ముందే, ఇప్పుడు జీహెచ్ఎంసీ నుంచి షోకాజ్ నోటీసులు రావడం మరోసారి అల్లు కుటుంబానికి షాక్‌గా మారింది.

Read Also :

సినీ, వ్యాపార రంగాల్లో బలమైన స్థానం కలిగిన అల్లు ఫ్యామిలీకి ఇవి వరుస వెన్నుపోట్లుగా మారుతున్నాయి. పెంట్‌హౌస్ విషయంలో అధికారులకు తగిన సమాధానం ఇవ్వకపోతే భవనం కూల్చివేత చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత వేడెక్కే అవకాశముంది.