Medicine : మందుగోలీలు.. సగం సగం సుంచి వేసుకుంటున్నారా..?

how medicines work in our body

Medicine : మనందరం కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యకి ట్యాబ్లెట్లు వాడుతూనే ఉంటాం. జలుబుకో, దగ్గుకో, జ్వరానికో.. ఇలా ఏదో ఒక రకమైన మందుగోళీలు తీసుకునే ఉంటాం.

అయితే.. చాలా మందికి ఒక అనుమానం  ఉంటుంది. మనకు తలనొప్పి ఉంటే ఆ ట్యాబ్లెట్ ని నోట్లో వేసుకుంటాం. అది కడుపులోకి వెళ్తుంది. కాసేటికే తలనొప్పి తగ్గిపోతుంది.

అదెలా  సాధ్యం.. కడుపులోకి వెళ్లిన ట్యాబ్లెట్ తలనొప్పిని ఎలా తగ్గిస్తుంది…  అని చాలామందికి విచిత్రమైన అనుమానాలు కలుగుతాయి.

ఆ అనుమానాలకు..  డౌట్స్ కి..  శ్రీకాంత్ మిరియాల అనే డాక్టర్ కం రైటర్ చాలా అద్భుతంగా అందరికి అర్థమయ్యేలా క్లారిటీ ఇచ్చారు.

మీరు కూడా చదివేయండి.

ప్రతి మందుకీ మన ఒంట్లో కణాల మీద రిసెప్టార్లు ఉంటాయి. ఈ రిసెప్టార్లకి (receptors ) మందు అతుక్కున్నప్పుడు అవి ఉత్తేజం అవ్వటం కానీ, నిద్రపోవటం కానీ జరిగి కణంలో కొన్ని రసాయన చర్యలు జరుగుతాయి.

ముందు ఈ మందులు కడుపు, పేగుల్లో శోషించబడి ( అబ్సార్బ్) రక్తంలో కలిసి అవి కాలేయం గుండా వెళతాయి. ఈ కాలేయంలో చాలామందు నిర్వీర్యం అయిపోతుంది. అలా అయిపోగా మిగిలిన మందు గుండెకి చేరి అక్కడ్నుంచి ఒళ్లంతా వెళ్తుంది.

మందైతే ఒళ్లంతా వెళ్తుంది కానీ అది పనిచెయ్యవలసిన రిసెప్టార్లు మాత్రం ఒంట్లో కొన్ని భాగాల్లోనే ఉంటాయి. కాబట్టి ఎక్కడ రిసెప్టార్లు ఉంటే అక్కడే పనిచేస్తుంది.

ఉదా, ట్రామడోల్ మందు ఉందనుకోండి, అది మెదడులో ఉండే ఓపియాయిడ్ రిసెప్టార్ల మీద పనిచేస్తుంది. అక్కడ వాటిని ఉత్తేజం చేసి మెదడుకి నొప్పిని తీసుకెళ్లే దారులపై పనిచేసి నొప్పిని తగ్గిస్తాయి.

medicine reaction

పోతే ఒకసారి రిసెప్టారుకి అతుక్కున్న మందులు, విడిపోవచ్చు. అలా విడిపోయినప్పుడు వాటి ప్రభావం కోల్పోతాయి. అలాగే విడిపోయినవి మళ్లీ రక్తంలో కలిసి కాలేయంలోకి వెళ్లి నిర్వీర్యం అవుతాయి. అక్కడ్నుంచి కిడ్నీలు వాటిని బయటికి మూత్రంలో పంపించేస్తాయి.

కొన్నిసార్లు మందులు రిసెప్టార్లని చాలా గట్టిగా పట్టుకుంటాయి, అప్పుడు కణం కొత్తగా రిసెప్టార్లని తయారుచేసి పంపిస్తుంది. అప్పుడు వాటిని మళ్లీ పట్టుకోవడానికి మందులు కావాలి. అందువలన మనం రోజూ మందులు వేసుకోవాల్సి ఉంటుంది.

కొన్నిసార్లు మందులు (Medicines)మనకి అక్కర్లేని రిసెప్టార్ల మీద కూడా పనిచేస్తాయి, అందువలన సైడ్ ఎఫెక్టులు వస్తాయి. ఈ విధంగా మనకి కావాల్సిన రిసెప్టారు మీద మాత్రమే పనిచేసే మందుల్ని తయారుచేయటం కష్టం.

అలాగే ఒక రిసెప్టారు ఒక అవయువంలో ఒక పనిచేస్తే ఇంకో అవయువంలో ఇంకో పని చేస్తుంది. మందు మాత్రం రిసెప్టారు ఎక్కడున్నా తగులుకుంటుంది అందువలన మనకి అక్కర్లేని భాగంలో పనిచెయ్యటం వలన సైడ్ ఎఫెక్టులు వస్తాయి.

ఉదా, నొప్పి మాత్రలు(Pain killers) మెదడులో ప్రోస్టాగ్లాండిన్స్ ని తగ్గించడం ద్వారా నొప్పిని తగ్గిస్తాయి, అయితే అలాగే కడుపులో కూడా తగ్గించెయ్యటం వలన కడుపులో మంట వస్తుంది సైడ్ ఎఫెక్టుగా. మళ్లీ ఆ మంట తగ్గించటానికి ఆసిడ్ రాకుండా తగ్గించే పాంటోప్రజాల్ ఇస్తారు. ఇలా అన్నమాట మందులు పనిచేస్తాయి.

..

Read Also :