Kukatpally Sahasra : పిల్లలకు వెబ్ సిరీస్ లు చూపిస్తున్నారా..? ఈ వార్త చదవండి..!

Kukatpally sahasra death mystery revealed

Kukatpally Sahasra: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. దయార్‌గూడలోని ఓ భవనం నాలుగో అంతస్తులో నివసిస్తున్నారు.

భర్త చిన్నచిన్న ఉద్యోగాలు చేసి వదిలేయగా, భార్య కొంతకాలం కిరాణా దుకాణం నడిపి ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. వారి కుమారుడు (15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే అతను బడికి సక్రమంగా వెళ్లేవాడు కాదు.

ఎక్కువ సమయం టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో క్రైమ్, హారర్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వీక్షించడంలో గడిపేవాడు. ఇటీవల అతను ధ్రువ్ రాఠీ అనే యూట్యూబర్ చానల్‌ను తరచుగా చూస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.

వారి ఇంటికి ఆనుకుని ఉన్న మూడంతస్తుల భవనంలోని పెంట్‌హౌస్‌లో సహస్ర తన కుటుంబంతో నివసిస్తోంది. సహస్ర సోదరుడు కూడా అదే పాఠశాలలో చదవడం వల్ల ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. మార్చిలో జరిగిన సహస్ర పుట్టినరోజు వేడుకలో కూడా బాలుడు పాల్గొని ఆమెకు కేక్ తినిపించాడు.

ఇక కొంతకాలంగా బాలుడు క్రికెట్ కిట్ కొనిపెట్టాలని తల్లిదండ్రులను పలుమార్లు అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో సహస్ర సోదరుడి వద్ద ఉన్న క్రికెట్ బ్యాట్ దొంగిలించాలనే ప్లాన్ వేసుకున్నాడు. తరచూ సహస్ర ఇంటికి వెళ్లి వస్తుండటంతో అక్కడి పరిస్థితులు అతనికి బాగా తెలుసు.

చోరీ తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇంటిని గ్యాస్ లీక్ చేసి కాల్చివేయాలని కూడా కుట్ర పన్నాడు. వరుస క్రమంలో పేపర్ పై రాసుకున్నాడు.

kukatpally sahasra death mystery
చోరీ ఎలా చేయాలనే విషయాలు పేపర్ పై రాసుకున్న బాలుడు

ఈ ప్లాన్ ప్రకారం, ఈ నెల 18న సహస్ర కుటుంబం అంతా బయటికి వెళ్తారని భావించాడు. కానీ బోయిన్‌పల్లి కేంద్రీయ విద్యాలయంలో స్పోర్ట్స్ మీట్ కారణంగా సహస్రకు నాలుగు రోజుల సెలవు రావడంతో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది.

ఈ విషయం తెలియని బాలుడు వారి ఇంటిలోకి ప్రవేశించాడు. తలుపు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లాడు. అప్పట్లో సహస్ర గదిలోనుంచి బయటకు రాగానే బాలుడిని చూసింది.

అరుస్తుందేమోనన్న భయంతో అతడు ఆమె గొంతులో కత్తితో పొడిచాడు. సహస్ర కూలిపోయినా చనిపోలేదని భావించి, మరింత క్రూరంగా మరో 20 సార్లు పొడిచి అక్కడే వదిలేశాడు.

తరువాత తన ఇంటికి చేరుకుని, రక్తం మరకలతో ఉన్న దుస్తులను దాచిపెట్టి వాషింగ్ మెషీన్‌లో వేసేశాడు. బయట ఆరేసిన బట్టలు వేసుకుని, తండ్రితో కలిసి పెంపుడు కుందేలును వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు.

మధ్యాహ్నం లంచ్ కోసం ఇంటికి వచ్చిన సహస్ర తండ్రి తన కుమార్తె రక్తపు మడుగులో మృతి చెంది కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

మొదట ఆధారాలు దొరకకపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టంగా మారింది. పోలీసుల విచారణలోనూ బాలుడు తప్పుదారి పట్టించే సమాధానాలు ఇస్తూ, సహస్ర అరుపులు “డాడీ, డాడీ”లా వినిపించాయని చెప్పి ఆమె తండ్రిపైనే అనుమానం కలిగించాడు.

అయితే స్థానికంగా నివసించే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతని ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో శుక్రవారం పాఠశాలలో ఉన్న బాలుడిని పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. గట్టిగా ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు.

దీంతో రక్తం మరకలతో ఉన్న దుస్తులు, నేరానికి ఉపయోగించిన కత్తి, లేఖ లభించాయి. ఆ లేఖలో ఇంటిని గ్యాస్ లీక్ చేసి కాల్చివేయాలనే కుట్ర వివరాలు ఉన్నాయి. ఈ ఆధారాలతో బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read Also :