ICRISAT : పల్లీ పంటకు కొత్త రక్షణ

ICRISAT: పల్లీ పంటలో వ్యాధి నిరోధక జీన్లను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్లాంట్ జినోమ్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని హైదరాబాదులోని ICRISAT సంస్థ తన భాగస్వామ్య సంస్థలతో కలిసి చేసింది. ఈ పరిశోధనలో 13 జీనోమిక్ ప్రాంతాలు, 145 జీన్లు కనుగొన్నారు. వీటి ఆధారంగా కొత్త రకాల పల్లీలు అభివృద్ధి చేయవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ హెక్టార్లలో పండించే పల్లీ పంట ప్రతి ఏడాది 50 మిలియన్ టన్నుల దిగుబడిని ఇస్తోంది. ఇది నూనెగింజ మాత్రమే కాదు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పు కూడా. భారతదేశం, నైజీరియా, చైనా దేశాలు ఎక్కువ పల్లీలు పండిస్తున్నాయి. కోట్లాది చిన్న రైతులకు ఈ పంట ఆదాయానికి ప్రధాన వనరు.

అయితే స్క్లెరోటియం రోల్ఫ్సీ అనే ఫంగస్ వల్ల వచ్చే స్టెమ్ రాట్ వ్యాధి రైతులను ఇబ్బందిపెడుతోంది. ఫంగిసైడ్లు వాడినా వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు. పర్యావరణానికి కూడా అది మేలు చేయదు.

ICRISAT డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్ మాట్లాడుతూ, జీనోమిక్ పరిశోధన ద్వారా వ్యాధి నిరోధక పల్లీ రకాల్ని తయారు చేస్తే రైతులకు స్థిరమైన దిగుబడులు వస్తాయని, దేశానికి కోట్ల రూపాయల నష్టం తగ్గుతుందని చెప్పారు.

ఈ పరిశోధనలో ICAR–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్రౌండ్‌నట్ రీసెర్చ్, చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ కూడా భాగస్వామ్యం చేశాయి. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్, ICAR నుంచి మద్దతు లభించింది.

Read Also :