BIG BREAKING : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతానికి అనిశ్చితి కొనసాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించడం కష్టమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ నెల 30 లోపు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తామని సీఎం అన్నారు. ప్రస్తుత పరిస్థితులను హైకోర్టుకు వివరించి ఏం చేయాలో కోరుతామన్నారు. సీఎం రేవంత్ తాజా కామెంట్స్ బట్టి చూస్తే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లేనని అర్థం అవుతుంది. కాగా తెలంగాణ హైకోర్టు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
బీసీ రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనుకుంటోంది. అయితే, ఈ బిల్లుకు కేంద్రం నుంచి ఆమోదం పొందడం, అలాగే 50% రిజర్వేషన్ల పరిమితిని మించి రిజర్వేషన్లు కల్పించడం వంటి అంశాలపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ అంశం తేలకపోవడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. బీసీ రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన సమస్యల కారణంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.

