Big Breaking : ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది సజీవదహనం

BREAKING NEWS-14-BATUKAMMA.COM

Big Breaking : రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కనీసం 20 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేపై థాయియత్ గ్రామం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బస్సు జైసల్మేర్ నుంచి బయలుదేరిన 20 కిలోమీటర్ల తర్వాత మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బస్సు వెనుక భాగం నుంచి పొగ వచ్చి, క్షణాల్లోనే మంటలు బస్సంతా వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో 19 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు జోధ్‌పూర్‌కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 20కు చేరింది. మరో 16 మందికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

వీరిని చికిత్స నిమిత్తం జైసల్మేర్‌లోని జవహర్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం జోధ్‌పూర్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొందరు ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకునేందుకు కదులుతున్న బస్సులోంచి కిందకు దూకేశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషాద ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ (PMNRF) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఏసీ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

..

Also Read :