Dolce veneto:ఉత్తర తుర్కియేలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన ఒక లగ్జరీ నౌక ప్రయాణం మొదలుపెట్టిన కొన్ని నిమిషాలకే సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన జోంగుల్డాక్ తీర ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే – ఈ నౌకను మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ నౌక నిర్మాణానికి దాదాపుగా 1 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయి. భారత కరెన్సీలో దాదాపు రూ.8.74 కోట్లు. ఎంతో శ్రమ, భారీ ఖర్చుతో తయారైన ఈ లగ్జరీ నౌకను మంగళవారం కొంతమంది ప్రయాణికులు, సిబ్బందితో సముద్ర యాత్రకు పంపించారు.
అయితే ఆ యాత్ర ఊహించని మలుపు తిరిగింది. నౌక ప్రయాణం మొదలైన 15 నిమిషాలు గడవకముందే అది ఒక్కసారిగా వంగి, నీటిలో మునగడం ప్రారంభించింది. నౌక మునిగిపోతున్న దృశ్యాలు చూసిన ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను రక్షించుకోవడానికి అందరూ వెంటనే సముద్రంలోకి దూకారు. అదృష్టవశాత్తూ వారందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరగలిగారు.
ఇదిలా ఉండగా, ఆ నౌక యజమాని మరియు కెప్టెన్ పరిస్థితిని చూసి తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. ఇంత భారీగా పెట్టుబడి పెట్టి నిర్మించిన నౌక కొద్ది నిమిషాల్లోనే మునిగిపోవడంతో వారు షాక్‌కు గురయ్యారు. చివరకు వారు కూడా సముద్రంలోకి దూకి, ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు.
ఈ ఘటనపై నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఎవరూ గాయపడలేదని, అందరూ సురక్షితంగానే బయటపడ్డారని స్పష్టం చేశారు. అయితే నౌక మునిగిపోవడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియలేదని, ఈ విషయంపై త్వరలోనే పూర్తి స్థాయి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రస్తుతం నౌక మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు నౌక నిర్మాణంలో లోపాలున్నాయేమోనని అనుకుంటే, మరికొందరు ఇది మానవ తప్పిదం కావచ్చని అంటున్నారు.

