Maruti Suzuki : భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ దసరా సీజన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు సాధించింది. కంపెనీ ఇప్పటివరకు 2.5 లక్షల బుకింగ్స్ పొందగా, ఎగుమతులు కూడా 50 శాతం వృద్ధి సాధించాయి. మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థ బెనర్జీ ప్రకారం, ఈసారి డిమాండ్ గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని స్థాయిలో ఉందన్నారు.
నవరాత్రి మొదటి 8 రోజుల్లోనే 1,65,000 వాహనాలు కస్టమర్లకు అందజేసినట్టు తెలిపారు. దసరా ముగిసే నాటికి ఈ సంఖ్య 2 లక్షల డెలివరీలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం నవరాత్రి కాలంలో కేవలం ఒక లక్ష వాహనాలు మాత్రమే డెలివరీ చేసిన సంగతి గుర్తుచేశారు. అంటే అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి.
ఈ వృద్ధికి ప్రధాన కారణం ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన GST 2.0 సంస్కరణలే అని బెనర్జీ చెప్పారు. “ముందు రోజుకు సగటున 10,000 బుకింగ్స్ ఉండేవి. ఇప్పుడు అవి 18,000కి చేరాయి. చిన్న కార్ల అమ్మకాలు 100 శాతం పెరిగాయి. మెట్రో నగరాల్లో 35–40% వృద్ధి కనిపిస్తోంది. అయితే చిన్న పట్టణాల్లో స్పందన ఇంకా బలంగా ఉంది,” అని ఆయన వివరించారు.
ఎగుమతుల పరంగా కూడా మారుతి సుజుకి బలమైన ఫలితాలు సాధించింది. ఇప్పటివరకు 42,000 వాహనాలను ఎగుమతి చేసింది. పెరిగిన డిమాండ్ కారణంగా కంపెనీ ఉత్పత్తి బృందం ఆదివారాలు, సెలవులు కూడా పనిచేస్తోంది. షోరూమ్‌లు, ఫైనాన్స్ భాగస్వాములు కూడా రాత్రింబవళ్ళు శ్రమించి కస్టమర్లకు త్వరగా డెలివరీలు అందిస్తున్నారు.
ప్రస్తుతం కంపెనీ వద్ద ఇంకా 2.5 లక్షల పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. అందువల్ల అక్టోబర్ నెలలో కూడా రికార్డు స్థాయి అమ్మకాలు సాధిస్తామని మారుతి సుజుకి ఆశిస్తోంది. ఈసారి ఫెస్టివల్ సీజన్ గత పది సంవత్సరాలలోనే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
Read Also :

