MIM : మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. షెడ్యూల్ విడుదల కాముందుకే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ ఖరారు చేసింది.
ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల వేటలో ఉన్నాయి. రేపు మాపో అభ్యర్థుల పేర్లను ఖరారు కావచ్చు. అయితే ఈసారి ఎంఐఎం పోటీ చేస్తుందా లేకపోతే అధికార కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. మజ్లిస్ పార్టీ నేరుగా బరిలో నిలవకుండా.. కాంగ్రెస్ కు మద్దతు పలకనుందని తెలుస్తుంది. దీని వెనుక పెద్ద స్కెచ్ వేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోల పోటీ చేయకుండా బదులుగా డిసెంబర్లో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పదవిని డిమాండ్ చేయనుందని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను రెండుగా విభజించే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాత నగర ప్రాంతం పరిధికి వచ్చే కార్పొరేషన్ మేయర్ గా తమ పార్టీ అభ్యర్థి ఉండేలా మజ్లిస్ ఇప్పటినుంచి ప్లాన్లు వేస్తుంది.
ఎంఐఎం పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గట్టి పట్టే ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పరంగా టాప్ 2లోఉంది. అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా నివసించే షేక్ పేట, రహ్మత్నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్ గూడ ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీకి పట్టుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షేక్ పేట, రహ్మత్నగర్ డివిజన్ల నుంచి మజ్లిస్ అభ్యర్థులు కార్పొరేటర్లుగా విజయం సాధించారు.
జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిని నిలపాలని మజ్లిస్ తొలుత భావించినప్ప టికీ తాజాగా పోటీపై యూటర్న్ తీసుకుంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా, జూబ్లీహిల్స్ లో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు దాదాపుగా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూల్
- పోలింగ్ తేదీ: నవంబర్ 11
- కౌంటింగ్, ఫలితాల తేదీ: నవంబర్ 14,
- అధికారిక నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 13
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 21
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 24

