Rajgopal reddy : మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal reddy)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎక్స్ వేదికగా సర్కారుపై ఫైర్ అయ్యారు.
మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas reddy)ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వ్యాసం రాశారు. నియోజకవర్గ అభివృద్దికి నిధులు ఇవ్వాలంటూ సొంత ప్రభుత్వంపైనే తుపాకీ ఎక్కుపెట్టారు.
భారీ భారీ ప్రాజెక్టులను డబ్బులు ఖర్చుపెడుతున్నారు కానీ.. గ్రామీణ స్థాయిలో అభివృద్దికి నిధులు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
అయితే ఆయన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎక్స్ వేదికగా తెలిపారు.
“అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి గారు చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను.
మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయి.
సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి వ్యవహరించాలి.” అంటూ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరో చర్చ మొదలైంది. ఇన్ని రోజులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే రెబల్ జెండా ఎగరేశారని అంతా అనుకున్నారు. కానీ ఆయనకు తోడుగా చాలామంది రెబల్స్ ఉన్నారనే విషయం దీని ద్వారా మరోసారి బట్టబయలైంది.
గతంలో కొందరు ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని.. ఢిల్లీ పెద్దల ముందు బల ప్రదర్శనకు కూడా ప్రయత్నించారని వార్తలు వచ్చాయి.
అయితే… యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆర్టికల్, దానిని రాజగోపాల్ రెడ్డి సమర్ధిస్తూ ట్వీట్ చేయడం చూస్తోంటే.. రాజగోపాల్ రెడ్డి నిజంగానే పెద్ద రెబల్ టీంను తయారు చేసినట్టుగా కనిపిస్తోంది.
రాబోయే రోజుల్లో మరికొందరు ఇలాగే ఎర్రజెండా ఎగరేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Read More :

