Trump tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగులాంటి వార్త చెప్పారు. 2025 అక్టోబర్ 1 నుంచి ఫార్మా దిగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తామని సంచలన ప్రకటన చేశారు. కిచెన్ పరికరాలు-బాత్రూం వానిటీస్ పై 50, అప్ హోస్టర్డ్-ఫర్నిచర్ పై 30, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తానని ట్రంప్ వెల్లడించారు.
అయితే అమెరికాలో ఇప్పటికే ప్లాంటులను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు వంద శాతం సుంకాలు వర్తించవన్నారు ట్రంప్. విదేశీ ఫర్నిచర్ సంస్థలు, అమెరికా మార్కెట్ ను వరదలా ముంచెత్తుతున్నాయని జాతీయ భద్రతా కారణాలతో వాటిపై భారీ టారిఫ్ లు తప్పనిసరన్నారు.
“Starting October 1st, 2025, we will be imposing a 100% Tariff on any branded or patented Pharmaceutical Product, unless a Company IS BUILDING their Pharmaceutical Manufacturing Plant in America…” – President Donald J. Trump pic.twitter.com/z5EXQhw1xK
— The White House (@WhiteHouse) September 25, 2025
విదేశీ తయారీ ట్రక్కులు, విడిభాగాలు దేశీయ ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ అన్నారు. తాజా సుంకాలు దేశీయ తయారీని పెంచుతాయని, ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించడంలో సాయపడతాయని ట్రంప్ వాదిస్తున్నారు. వ్యాపారులు తొలుత విధించిన సుంకాలకు అలవాటు పడతున్న క్రమంలోనే.. ట్రంప్ కొత్త సుంకాలతో అలజడి సృష్టిస్తున్నారు.
ట్రంప్ తీసుకున్నఈ చర్య భారత ఫార్మా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.భారత్ కు అమెరికా అతిపెద్ద ఔషధ ఎగుమతి గమ్యస్థానం. 2024లో, భారత్ మొత్తం ఔషధ ఎగుమతుల్లో 31% అంటే సుమారు $8.7 బిలియన్ విలువైన ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. అమెరికాలో ఉపయోగించే జెనరిక్ మందుల్లో 45% వరకు భారత్ నుంచే సరఫరా అవుతాయి.
ఈ పరిణామంపై భారత ప్రభుత్వం, ఫార్మా పరిశ్రమ ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాలి. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గందరగోళానికి దారితీసింది.
Read Also :

