Robin Robo : అమెరికాలోని ఆసుపత్రుల్లో పిల్లలకు కొత్త స్నేహితుడు వచ్చాడు. అతనే రోబిన్ రోబో. ఈ రోబో చిన్నారి లాగా మాట్లాడుతాడు, ఆటలు ఆడతాడు, పాటలు పాడతాడు. పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ల భావాలను అర్థం చేసుకుని అలాంటి స్పందన ఇస్తాడు. ఎవరు నవ్వితే రోబిన్ కూడా నవ్వుతాడు, ఎవరు బాధ చెప్పుకుంటే రోబిన్ కూడా బాధతో కనిపిస్తాడు.

లూకా అనే ఆరేళ్ల చిన్నారికి లుకేమియా అని తెలిసిన కొన్ని రోజులకు, ఆసుపత్రిలో రోబిన్ రోబో అతన్ని పలకరించాడు. “లూకా, ఎలా ఉన్నావు?” అని అడిగినప్పుడు, అతని ముఖం ఆనందంతో మెరిసిపోయింది. ఆ క్షణం తల్లికి మరపురానిది.
రోబిన్ కేవలం పిల్లలకే కాదు, వృద్ధులకూ స్నేహితుడిగా మారుతున్నాడు. నర్సింగ్ హోమ్స్‌లో వృద్ధులతో జ్ఞాపకశక్తి ఆటలు ఆడిస్తాడు, శ్వాసాభ్యాసాలు చేయిస్తాడు, ఒంటరితనాన్ని పోగొడతాడు. కొందరికి పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు కూడా రోబిన్ వాళ్ల ఇష్టమైన పాటలు, వీడియోలు చూపించి శాంతింపజేశాడు.

భవిష్యత్తులో రోబిన్ ఇంకా మరిన్ని పనులు చేయగలడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోగుల బీపీ, పల్స్ వంటి వివరాలు కొలిచి డాక్టర్లకు పంపేలా చేయాలని యోచిస్తున్నారు. అలాగే వృద్ధులకు దుస్తులు మార్చడంలో, అవసరమైనప్పుడు సహాయం చేయడంలో కూడా ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నారు.
ఆర్మేనియాకు చెందిన కరెన్ ఖచిక్యాన్ అనే యువకుడు చిన్నప్పుడు ఒంటరితనం అనుభవించాడు. అందుకే పిల్లలకు స్నేహితుడిలా ఉండే రోబోని తయారు చేయాలని కలగన్నాడు. అలా పుట్టింది రోబిన్. నేడు అమెరికాలోని పలు ఆసుపత్రుల్లో ఈ రోబో పిల్లలకు మిత్రుడిగా మారి ఆనందాన్ని పంచుతున్నాడు.

