Raw Milk : ఈ మధ్యకాలంలో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ డాక్టర్లు ఎక్కువైపోయారు. ఇది తింటే ఆరోగ్యం.. అది తింటే ఆరోగ్యం.. ఇది తాగితే ఆరోగ్యం.. అది తాగితే ఆరోగ్యం అని.. ఏది పడితే అది చెబుతున్నారు.
అందులో పచ్చిపాల నుండి నెయ్యి వరకు అన్నీ ఉన్నాయి.
కండపుష్టి కలగాలంటే పచ్చిపాలు తాగాలని సలహాలు ఇచ్చేవాళ్లు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు. అయితే.. నిజంగానే పచ్చి పాలు ఆరోగ్యానికి మంచివేనా..? లేకపోతే అవి తాగితే రోగాల పాలై ప్రాణాలు పోతాయా.?
ఆ పచ్చిపాల కథ ఏంటి..? తాగితే ఏమతుంది.? .. డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల.. అద్భుతంగా వివరించారు. ప్రతీ ఒక్కరు తప్పకుండా చదవండి. ఇది చదివాక పచ్చిపాలు(Raw Milk) ముట్టుకోవాలంటే వెన్నులో వణుకుపుట్టడం పక్కా..!
అప్పారావు ఇన్స్టాగ్రామ్ తెరిచాడు. ఒక ఉత్తర భారతీయ రైతు తన ఆవు పొదుగు కింద కొడుకుని పెట్టి పాలు సరాసరి ఆ పిల్లాడి నోట్లో పడేట్లు సిరాలు పిసికాడు. ఆ పిల్లాడు నాలుకతో ఆ పెదాలు చప్పరిస్తూ ఒక వెడల్పైన చిరునవ్వు వదిలాడు. అప్పారావు క్యూట్ అనుకున్నాడు. ఒక లైక్ కొట్టాడు.
ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్ ఉత్తేజితం అయింది. తర్వాతి వీడియోలో ఒక తెల్ల జుబ్బా వేసుకున్న వ్యక్తి వెనక బ్యాగ్రౌండ్లో రకరకాల మొక్కలు పెట్టి, “పాశ్చరైజేషన్ పాశ్చాత్య పద్ధతి, దేశీ ఆవు దేశీ పద్ధతి”, “ ప్యాకెట్ పాలు వద్దు, పొదుగు పాలు ముద్దు” అని ఒక గ్లాసు పాలు గడగడా తాగేశాడు. తాగేసి మీసాలకి అంటిన పాలు తుడుచుకుని, చేతికున్న కండలు చూపించాడు. మరో లైక్ వేసుకున్నాడు.
మరుసటిరోజు పొద్దున్నే ఒక చిన్న తపేలా పట్టుకెళ్లి శాల్లో కట్టేసిన గేదె దగ్గరికెళ్ళి, ఆ తపేలా తో తెచ్చిన నీళ్లతో రెండుసార్లు పొదుగుకి చల్లి, మిగతా నీళ్ళు అక్కడే గేదె పోసిన ఉచ్చలో పోసేసి, ఇక తపేలా నిండా పాలు పితికేశాడు. ఇంట్లోకి పట్టుకొచ్చి, వాళ్ళావిడ ముందు పహిల్వాన్ లాగా ఎత్తింది దించకుండా ఒక అరలీటరు పాలు తాగేశాడు,
తాగేసి కండలు చూపించాడు ఆవిడకి. మరిగిద్దును కదా అందావిడ. పచ్చి పాలు తాగితే ఇక రాత్రంతా ఇచ్చికాలే అన్నాడు. ఆవిడ సిగ్గు పడింది.
మూడు రోజులు తాగాడు, నాలుగో రోజు కాళ్లలో తిమ్మిర్లు మొదలయ్యాయి. కండలు పెరుగుతున్నాయి అనుకున్నాడు. ఐదో రోజు ఆ తిమ్మిర్లు ఎక్కువయ్యి, నడక కష్టమైంది. ఊర్లో డాక్టరు ఇదేదో తేడాగా ఉంది, పట్నం పొమ్మన్నాడు. పట్నం వెళ్ళాక జనరల్ మెడిసిన్ డాక్టరు చూసాడు. అన్ని ప్రశ్నలూ వేశాడు. ఏదీ అంతు చిక్కలేదు. ఈ మధ్య ఏమన్నా తిండి మార్చావా అని అడిగితే పచ్చి పాల ప్రయోగం గురించి చెప్పాడు.
డాక్టరు వెంటనే నీ ప్రాణానికి ప్రమాదం ఆస్పత్రిలో చేరిపో అన్నాడు. వీడెవడో డబ్బులు దొబ్బేసేవాడిలా ఉన్నాడని అక్కడ్నుంచి బయటికొచ్చేసి ఆటో ఎక్కేశాడు ఊరికి. దార్లో ఇన్స్టాగ్రామ్లో తెల్ల జుబ్బా వాడికి పర్సనల్ మెసేజీ పెట్టాడు ఇలా ఉంది ఏం చెయ్యాలని. అదెళ్లి ఆ తెల్ల జుబ్బా అతని అకౌంటులో ఉన్న పదివేల డిఎమ్ముల్లో మునిగిపోయింది.
ఊరెళ్లి ఆటో దిగి పట్టు తప్పి రోడ్డు మీద పడిపోయాడు. నిలబెట్టారు. మళ్లీ పడిపోయాడు. మంచం మీద వేశారు. ఊపిరి కష్టంగా ఉందన్నాడు కాసేపటికి. మళ్లీ అదే ఆటోలో అదే పట్నం డాక్టరు దగ్గరికి పట్టుకెళ్ళారు. ఈసారి డాక్టరుకి వద్దని కావాలని చెప్పడానికి అప్పారావుకి మాట రావట్లేదు. మాట పడిపోయింది. ఒంట్లో ఒక్కొక్కటే చచ్చుబడిపోతోంది.
డాక్టరు ఇక నోట్లో బడ్డు పెట్టి, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వెంటిలేటర్ కి తగిలించాడు. ఐసీయులో పెట్టాడు. అప్పారావు కూతురు ఏమైందని అడిగింది డాక్టర్ని. “మీ నాన్న పచ్చి పాలు తాగాడు. అందులో క్యాంపైలోబ్యాక్టర్ అని ఒక బాక్టీరియా కడుపులోకి చేరింది. దానికి మీ నాన్న రోగనిరోధక శక్తి యాంటీ బాడీస్ తయారు చేసింది. అవేమో మీనాన్న నాడుల్ని కొరికేశాయి. ఇప్పుడు మీ నాన్నకి ఊపిరి ఆడట్లేదు. కొంచెం కష్టమే.” అన్నాడు డాక్టరు.
ఆ తర్వాత ప్లాస్మా ఫెరెసిస్ అని రక్తం కడిగాడు, ఐవీ ఐజీ అని సెలైన్ ఎక్కించాడు. ఏది చేసినా అప్పారావు వెంటిలేటర్ వదిలి రాలేదు. డాక్టరే వెంటిలేటర్ లాగేసాడు. అప్పారావు పైకెళ్లిపోయాడు.
దండ వేసిన అప్పారావు ఫోటోని బ్యాగ్రౌండ్లో పెట్టి, “పొదుగు కోసం పైకెళ్లిపోయావా పెనిమిటీ!” అని పాట పాడుతూ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టింది వాళ్లవిడ. ఈలోపు ఆ తెల్ల జుబ్బా వాడు “జిల్లేడు పాలు, కంటి చూపు” అని ఇంకొక రీలు వదిలాడు.
…
Read Also :

