Gastric acid : మనకి గొంతు నుంచి కడుపుకి ఒక గొట్టం ఉంటుంది. దానిని యూసోఫాగస్ (అన్నవాహిక) అంటారు. దానిలోపల గోడ మీద కణాలు టైల్సు వేసినట్లు ఉంటాయి. అలాగే కడుపులోపలి (స్టమక్) గోడలో కణాలు స్తంభాల్లా ఉంటాయి. అవి కడుపులో కారే యాసిడ్‌ని (Gastric acid)తట్టుకోగలవు. ఈ యాసిడ్డు పైకి తన్నకుండా అక్కడొక వాల్వు ఉంటుంది. కాబట్టి ఆహారం ఎప్పుడూ పైనుంచి కిందకే వెళ్తుంది. వెనక్కి రాదు.
అయితే కొంతమంది పొద్దున్న పళ్లు తోముకుని నాలుక గీసుకుని మొహం కడుక్కోడం మాత్రమే కాకుండా రెండు వేళ్ళని ఆ కొండనాలుక వెనక్కి తోసి, ఆ కడుపులోంది ఎక్కలాగుతారు. అది ఖాళీ కడుపు, అందులో యాసిడ్ తప్ప ఇంకేం ఉండదు. అప్పుడు ఆ యాసిడ్ కడుపులోంచి పైకొచ్చి వాంతిలా వస్తుంది.

అయితే బిర్యానీ మసాలాలకి అలవాటు పడ్డ ఈ యూసోఫాగస్ గోడలు హఠాత్తుగా కింద నుంచి వచ్చిన ఈ యాసిడ్ ని చూసి ఆశ్చర్యపోయింది. అక్కడున్న టైల్సు ఆ యాసిడ్స్‌ని తట్టుకోలేవు. అలా రోజూ వాంతి తెప్పించుకుని చేస్తే ఆ టైల్సు అరిగిపోయి ఒరిసిపోతుంది. ఎర్రగా మారుతుంది. గుండెల్లో మంట వస్తుంది.
కొన్నాళ్ళకి ఈ టైల్సు ఈ యాసిడ్‌కి పనికిరావు అని అక్కడ స్తంభాలు వస్తాయి కడుపులోలాగా. కానీ ఆ స్తంభాలు నిలకడ లేనివి. అందుకని అవి మళ్లీ మళ్లీ పడుతుంటాయి. అంటే యాసిడు, ఒరుపు, ఎరుపు, టైల్సు నుంచి స్తంభాల మార్పు ఇలా మాటి మాటికీ జరుగుతుంది. వాంతి చెయ్యటం ఆపనంత వరకూ ఇలా జరుగుతూనే ఉంటుంది.
అయితే ఒంట్లో ఇలా దేన్నైనా పదే పదే ఇబ్బంది పెడితే అది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది. ఈ స్తంభాలు కొన్నిసార్లు సరిగా ఏర్పడక అక్కడ కణాలు గాడి తప్పి అవి క్యాన్సర్ కణాలు అవుతాయి. అయితే ఇలా అవ్వటం చాలా అరుదు. కానీ జరిగే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్ళు స్మోకింగ్ చేసినా, గుట్కా తిన్నా, మందు తాగినా ఇలాంటివేం చేసినా ఆ రిస్కు ఎక్కువై క్యాన్సర్ వస్తుంది.

ఇప్పుడూ నాలుక వెనక మనకి ఏముందో అనవసరం, దాన్ని లాగి ఎక్కలాగి పీకి తీయక్కర్లేదు. ఇప్పుడు లాగితే తెమడలాగా వచ్చేది మ్యూకస్ అంటారు, అది సహజం. అది యాసిడ్ నుంచి రక్షణని ఇస్తుంది. దాన్నంతా లాగి పీకి ఏం శుభ్రం చేసుకుంటావు.
నీ గర్ల్‌ఫ్రెండ్ ముద్దు పెట్టినా ఆమె నాలుకేమీ మీటరు పొడవుండదు కదా లోపలికెళ్ళి నువ్వు నిన్నేం తిన్నావో లాగి తియ్యడానికి, అందుకని వర్రీ కాకుండా లోపలున్నది లోపల ఉండనీయండి. పళ్లు తోముకోండి, నాలుక గీసుకోండి, మొహం కడుక్కోండి అంతే.
Read Also : మలబార్ గోల్డ్ అదరిపోయే యాడ్

