Rajgopal Reddy : మనుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటుకు ఫలితం వచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయనను కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాటి నుండి ఆయన మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. తాను హోంశాఖ మంత్రిని కాబోతున్నానని అసెంబ్లీ వేదికగా చెప్పుకున్నారు.
కానీ సర్కారు ఏర్పడ్డ చాలా కాలం తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి(Rajgopal Reddy) అవకాశం దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన అప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటున్నారు.
పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తన మాటల తూటాలు పేలుస్తున్నారు.
దీంతో పార్టీ అధిష్టానం దిగివచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆయనను కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖ కేటాయిస్తారని అంటున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కూడా విద్యాశాఖను రేవంత్ రెడ్డి ఎవరికీ ఇవ్వలేదు. తన దగ్గరే పెట్టుకున్నారు.
కానీ ఇప్పుడు అదే పోర్ట్ ఫోలియోను ఆయన దగ్గర నుండి తీసేసి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారని తెలుస్తోంది.
దీనిపై ఇప్పటికే మునుగోడులో జోరుగా ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజన్న టీం పేరుతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పడుతున్నారు.
దసరా సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్యానర్లు కూడా వెలిశాయి. మినిస్టర్ రాజన్న అంటూ.. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో మంత్రి పదవి కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది.
అయితే దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించాల్సి ఉంది.
మరోవైపు.. మంత్రి పదవి విషయంలో పార్టీపై ఒత్తిడి పెంచే ప్లాన్ లో భాగంగానే నియోజకవర్గంలో ఫ్లెక్సీలు పెట్టించారనే చర్చ కూడా జరుగుతోంది. మంత్రి పదవి కావాలని నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నారనే విషయం ఢిల్లీ దాకా తెలియాలనే ఇలా ప్లాన్ చేశారని సమాచారం.
..
Read Also :.

