కేంద్రంలో జగన్ కు ఎన్ని మంత్రి పదవులు..!?

లోక్ సభ ఎన్నికల తర్వాత రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా మారారు. మొన్నటి దాకా కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రకటనలు చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో ఎదురుదెబ్బతగిలింది. అసెంబ్లీ సీట్లు, లోక్ సభ సీట్ల దగ్గర..  రెండు చోట్లా బొక్కబోర్లా పడ్డారు.

కానీ.. వైఎస్ జగన్ మాత్రం మెజార్టీ సీట్లతో విజయం సాధించారు. ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లో  22 సీట్లను వైసీపీ సొంతం చేసుకుంది. దేశంలో ఎక్కువ లోక్ సభ సీట్లు సాధించిన ఐదో పార్టీగా నిలిచింది. దేశంలో ఉన్న అనేక జాతీయపార్టీలను వెనక్కి నెట్టింది వైసీపీ. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ కూడా 22 సీట్లే సాధించింది.

దీంతో ఇప్పుడు మోడీ కన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పై పడింది. ముందునుంచీ మోడీతో జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఫలితాల తర్వాత జగన్ స్వయంగా వెళ్లి మోడీని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాంమాధవ్ ను కలవడం దీనికి మరింత బలాన్నిచ్చింది.

ఇప్పుడు బీజేపీనే స్వయంగా జగన్ ను తమ కేబినెట్ లోకి ఆహ్వానిస్తోందట. అత్యధిక సీట్లు సాధించి.. యూపీఏ లో లేని పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. దీంతో జగన్ ను తమ వైపు తిప్పుకుంటే భవిష్యత్ లో పనికొస్తాడనే ఆలోచనలో ఉన్నారట మోడీ. అందుకే కేంద్రమంత్రి పదవులు ఆఫర్ చేశారనే వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది బీజేపీ. ఇప్పుడు వైసీపీకి కూడా రెండు నుంచి మూడు బెర్త్ లు కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

కేబినెట్ ఎంట్రీలో భాగంగానే.. రేపు సాయంత్రం జరిగే మోడీ ప్రమాణస్వీకారానికి కూడా జగన్ హాజరవుతారనే మాట వినబడుతోంది. అయితే.. కేంద్రమంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తారనేది… తేలాల్సి ఉంది.