వీ6 లో బోనస్.. ఉద్యోగుల సంబరాలు

తెలుగు న్యూస్ మీడియాలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వీ6 న్యూస్.. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. అందులో పనిచేస్తున్న ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్ చెప్పింది. వీ6 న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది.

ప్రస్తుతం తెలుగు మీడియాలో పరిస్థితి బాగోలేదు. చాలా ఛానళ్లు తమ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని ఛానళ్లు నాలుగైదు నెలలకోసారి జీతాలు ఇస్తున్న పరిస్థితి. జీతాల కోసం జర్నలిస్టులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. తెలుగులో న్యూస్ ఛానళ్లు పెరిగిపోవడంతో.. చాలా వార్తా ఛానళ్ల మనుగడే కష్టంగా మారింది. కొన్ని మూతపడ్డాయి కూడా.

కానీ వీ6 న్యూస్ లో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. రేటింగుల్లో టాప్ ప్లేస్ లో ఉన్న చానళ్లను సైతం దాటేసి.. నంబర్ వన్ పొజిషన్ కి ఎదిగింది. తెలంగాణలో నంబర్ వన్ న్యూస్ ఛానల్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు.. వార్తల విషయంలో క్రెడిబిలిటీ ఉన్న ఛానల్ గా ప్రజల మన్ననలు పొందుతోంది. అందుకే  వీ6 వ్యూయర్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

అయితే.. చాలా సంస్థలు జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో ఉంటే.. వీ6 మాత్రం ప్రతీ ఏడాది ఉద్యోగులకు జీతాలు పెంచుతోంది. అది కూడా 10 నుంచి 20 వరకు ఉంటోందని ఉద్యోగులు చెబుతుంటారు. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది వీ6 మేనేజ్ మెంట్. ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. వీ6 న్యూస్ మంచి లాభాల్లో కొనసాగుతున్నందున.. లాభాల్లో ఉద్యోగులకు భాగం కల్పిస్తామని గతంలోనే ప్రకటించారు చైర్మన్ వివేక్ వెంకటస్వామి. చెప్పినట్టుగానే ఈ నెల ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు.