ఊరంతా అనుకుంటున్నారు.. రివ్యూ

నటీనటులు : నవీన్ విజయ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫీ సింగ్, జయసుధ, కోట శ్రీనివాస రావు, రావు రమేష్ తదితరులు.

దర్శకత్వం : బాలాజీ సనల

నిర్మాత‌లు : శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల,పి ఎల్ ఎన్ రెడ్డి

సంగీతం : కె ఆర్ రాధాకృష్ణన్

సినిమాటోగ్రఫీ : జి బాబు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్లాసిక్ టైటిల్ తో వచ్చే సినిమాలకు అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా బాలాజీ సనాల దర్శకత్వంలో రోవస్కైర్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, యుఐ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించగా విడుదలైన సినిమా ‘ఊరంతా అనుకుంటున్నారు’. నవీన్ విజయ క్రిష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, సోఫియా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. పల్లెటూరు వాతావరణంను తలపించే పేరుతో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
పచ్చని పైరుతో కళకళలాడుతున్న స్వచ్ఛమైన పల్లెటూరు రామాపురం. ఆ గ్రామానికి ఓ కట్టుబాటు ఉంటుంది. ఈ పల్లెటూరిలో ఎవరికైనా పెళ్లి చేయాలంటే ఆ ఊరిలోని అందరూ జంట పెళ్లికి అంగీకారం తెలపాలి. అలాంటి ఊరిలో పుట్టిన మహేష్ (నవీన్ విజయకృష్ణ)కి , గౌరి (మేఘ చౌదరి)కి పెళ్లి చేయాలని ఆ ఊరంతా నిర్ణయించుకుంటారు. అయితే అప్పటికే మహేష్ మాయ (సోఫియా సొన్గ్)తో ప్రేమలో పడితాడు. గౌరి, శివ రామన్ అయ్యర్ (అవసరాల శ్రీనివాస్ )తో ప్రేమలో పడుతుంది. దాంతో పెద్దలు నిర్ణయించిన పెళ్లిని కాదని.. మహేష్, గౌరి ఇద్దరూ తమ ప్రేమ గురించి పెద్దలకు చెబుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి ? పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ? ఊరంతా వీరి పెళ్లికి ఒప్పుకున్నారా? లేదా? అనేదే అసలు కథ.

విశ్లేషణ:
సాధారణంగా పల్లెటూర్లలో కనిపించే పచ్చటి వాతావరణం.. పచ్చని పైరుతో కళకళలాడుతూ ఉండే పల్లెటూరు ప్రదేశాలను పచ్చని పొలాలను కళ్లకు ఆనందం కలిగించేలా చాలా చక్కగా తీశారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే పల్లె వాసనను గుర్తు చేసే సీన్స్, అలాగే బంధాలు బంధుత్వాలకి సంబంధించిన కొన్ని అంశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. చాలా కాలం తర్వాత పల్లెటూరు వాతావరణంలో ఆహ్లాదమైన కథతో ఇంటిల్లిపాది చూసేలా సినిమా తీశారు దర్శకులు. ఆసక్తికర కథాంశంతో ఉత్కంఠ కలిగించే కథనంతో మంచి సన్నివేశాలు.. అందుకు తగ్గట్లుగా నటించే నటులు సినిమాలో ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. నటీనటుల నటన సినిమాకు బాగా ఉపయోగపడింది. కాకపోతే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

నటీనటుల నటన:
హీరోగా నటించిన నవీన్ విజయ్ కృష్ణ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తానూ ప్రేమించిన అమ్మాయిలో నిజమైన ప్రేమను వెతుకుంటూ.. చివరికీ తను ప్రేమించాల్సిన అమ్మాయే వేరు అని తెలుసుకునే క్రమంలో వచ్చే సన్నివేశాల్లో నవీన్ ఒదిగిపోయాడు.

అలాగే మరో కీలక పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ నటన సినిమాకు బాగా కలిసి వచ్చింది. కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో యాక్టింగ్ చక్కగా చేశాడు. ముఖ్యంగా తమిళ్ మాడ్యులేషన్ లో అవసరాల చెప్పే డైలాగ్ లతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన మేఘ చౌదరి, సోఫియా సొన్గ్ అందం, అభినయంతో మెప్పించారు. మరో కీలక పాత్రలో నటించిన రావు రమేష్ తన ఎక్స్ ప్రెషన్స్ తో, తన శైలి మాడ్యులేషన్ తో సినిమాలో మంచి నటన కనబరిచారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు జయసుధ, కోట శ్రీనివాస రావులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

Batukamma.com

సాంకేతిక విభాగం:

దర్శకత్వం వహించిన బాలాజీ సనాల కమర్షియల్ హంగులతో కూడిన కథను ఎంచుకుని అంతే చక్కగా సినిమాను రూపొందించారు. రచయితగా తను రాసుకున్న కథను అనుకున్నట్లే తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ అందించిన బాబు సినిమాకు న్యాయం చేశాడు. పల్లెటూరు వాతావరణం కళ్లకు కట్టేలా చూపించారంటే అందుకు కారణం సినిమాటోగ్రఫీనే. కొన్ని పెల్లెటూరు విజువల్స్ ను ఆయన చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు కె ఆర్ రాధాకృష్ణన్ అందించిన పాటలు పర్వాలేదు.. ఓ సాంగ్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో హైలెట్ గా నిలిచింది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.యెన్. రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మాణ విలువలు పర్వాలేదు.

ఓవరాల్ గా ఊరంతా అనుకుంటున్నారు అంటూ హ్యూమన్‌ రిలేషన్స్‌ కు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో సాగిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 3/5