TSPSC తిక్క లెక్కలు

మన రాష్ట్రమొచ్చి మన పాలన వచ్చాక.. ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు వచ్చేస్తాయని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే.. APPSCనే నూరు పాళ్లు నయం అంటున్నారు

TSPSC FSO EXAM
  • నిరుద్యోగులతో ఆడుకుంటున్న TSPSC
  • సెంటర్ల విషయంలో గందరగోళం
  • అప్లికేషన్ లో ఒకటి.. హాల్ టికెట్ లో మరో సెంటర్
  • TSPSC నిర్వహించిన ప్రతీ పరీక్షలో ఏదో ఒక సమస్య
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే వ్యవస్థ ఉన్నది. కానీ ఇది వ్యవస్థా..? నిరోద్యోగులకు అవస్థా..? అనేది మాత్రం అర్థం కావడం లేదు. ఇది ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ చిన్న రిమార్క్ లేకుండా.. ఏ ఒక్క పరీక్ష జరిగింది లేదు. ప్రతీసారి ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంది.

లెటెస్ట్ గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం TSPSC పరీక్ష నిర్వహించింది. ఈ నెల 23న అంటే ఆదివారం నాడు ఈ పరీక్ష జరిగింది. పరీక్ష రాసే అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాల్సిన ఈ వ్యవస్థ.. వారిని ఇబ్బందులకు గురిచేసి..  కొందర్ని పరీక్ష రాయకుండా చేసిందనే చెప్పాలి.

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు ఆన్ లైన్ అప్లికేషన్ సమయంలో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పరీక్షా కేంద్రం ఉంటుందని చెప్పారు. సెంటర్ కోసం ఒకటే ఆప్షన్ ఇచ్చారు కూడా. సెంటర్ ఎలాగూ హైదరాబాద్ లోనే కదా అని చాలా మంది ఫిక్సయిపోయారు.

కానీ అక్కడున్నది TSPSC కదా. అంత ఈజీగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ జరిగితే ఎలా..? అందుకే సెంటర్ లు మారిపోయాయి. సెంటర్ల సంఖ్య మారిపోయింది. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసి చూసుకున్న అభ్యర్థులు షాకయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్లను తీసుకెళ్లి కరీంనగర్ లో.. కరీంనగర్, ఇతర ఉత్తర తెలంగాణ వాళ్లను తీసుకెళ్లి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాలేజీల్లో సెంటర్లు వేశారు.ఈ రెండే కాదు.. మరికొన్ని చోట్ల కూడా పరీక్ష కేంద్రాలు పెట్టినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ లో అయినా అభ్యర్థులకు అందుబాటులో ఎగ్జామ్ సెంటర్ పెట్టారా అంటే అదీ లేదు.. అక్కడెక్కడో ఊరి చివరన పెట్టడంతో.. ఒక్కక్కరు జర్నీ చేసే అక్కడికి వెళ్లేందుకు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. కొందరైతే.. కార్లు కిరాయికి మాట్లాడుకుని.. గూగుల్ మ్యాప్ లో వెతుక్కుంటూ తిప్పలు పడుతూ వచ్చారు. అలా వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. చివరికి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లా.. వేళ్లా పడితే గానీ.. పరీక్ష రాసేందుకు అనుమతి దొరకలేదు.

గంటా చక్రపాణి, TSPSC చైర్మన్

ఇక.. హాల్ టికెట్ లో సెంటర్ అడ్రస్ చూసుకున్న చాలామంది.. పరీక్ష రాయడమే మానేశారు. హైదరాబాద్ శివారు దుండిగల్ లోని MLR ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్ లో ఒక రూంలో 60 మందికి పరీక్ష పెడితే.. అందులో కేవలం 20 మాత్రమే అటెండయ్యారు. అంటే.. అంత దూరం ఎలా వెళ్లాలి..? అని ఓవరాల్ గా ఎంతమంది పరీక్ష రాయకుండా వదిలేశారో అర్థం చేసుకోండి. అదేదో లక్షల మంది రాశారు. అందుకే సెంటర్లు మార్చారు అన్నట్టు కూడా కాదు. రాసిందే చాలా తక్కువ మంది. అయినా ఇలా ఇష్టారాజ్యంగా సెంటర్లు వేశారు.

ఇదొక్క పరీక్ష కాదు.. గతంలో నిర్వహించిన ప్రతీ పరీక్షకు ఇలాంటి సమస్యలే వచ్చాయి. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర్నుంచి.. ఫలితాల దాకా ప్రతీ దాంట్లో ఇబ్బందులే. అసలే ఉద్యోగాలు లేక మానసికంగా కుంగిపోయి ఉన్న అభ్యర్థులు.. TSPSC పెడుతున్న ఈ ఎక్స్ ట్రా ఎగ్జామ్ కు మరింత కుంగిపోవాల్సి వస్తోంది.

మన రాష్ట్రమొచ్చి మన పాలన వచ్చాక.. ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు వచ్చేస్తాయని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే.. APPSCనే నూరు పాళ్లు నయం అంటున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్ష సమయంలోనే ఇన్ని ఇబ్బందులు పెట్టారు… ఇక ఫలితాల సంగతి ఎలా ఉంటుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.