చదివేతే కన్నీరు రావడం ఖాయం

కొన్ని చూపులు.. ఓ హత్య చేశాయ్
వళ్లంతా తడుముతూ వెకిలిగా నవ్వుతూ
దెయ్యం మొహపోడికన్నా దారుణం చేస్తున్నాయ్
పైనుంచి కింది వరకూ క్షణానికో రేప్…
కాసేపు టోల్ప్లాజా దగ్గర నిలబడే ధైర్యం చేయనీయవ్
రొమ్ముల సైజు బహిరంగంగా లెక్కలేస్తాయి
పిరుదుల తీరు పదిమందిలో కొలతలు తీస్తాయి
దాగున్న మానాన్ని పెకిలించి
మనిషన్న తనాన్ని పెరికించి చూస్తూ
కొన్ని చూపులు.. అనేక హత్యలు దారుణాలు
బాలింత పాలిండ్లు పసిపాప చాతీ
ముదుసలి… రోగి… అంధురాలు… పక్షవాతి….
పోలియో అభాగ్యురాలు ఎవర్నీ వదలవ్…
అది రసాస్వాదన కాదు, జనాల మధ్య
సొంగ కారుస్తున్న పిచ్చికుక్కలు
అది రొమాంటిక్ కాదు, పబ్లిక్లో
పరుగులు తీస్తున్న విషసర్పాలు
మగతనం, రసికదనం అస్సలే కాదు
కళ్లకు గనేరియా వచ్చిన విశృంఖలత్వం
అమ్మ పట్టుచీర కట్టి సూరీడి బొట్టు పెట్టేది
చెల్లె జీనుప్యాంటు తొడగి లిప్స్టిక్ పెట్టేది
అందాల్ని వెదుక్కోమనికాదు,
తనో నిండు మనిషని.. తనదో ముందడుగు మనసని
అయినా, వళ్లంతా కప్పుకున్నా… చీకట్లో నిలుచున్నా
కొన్ని చూపులు అదేపనిగా తడిమేస్తుంటాయి
వరస అత్యాచారాలు.. సీరియల్ మర్డర్లు చేసేస్తుంటాయి

ఆర్టిస్టిక్ పర్సెప్షన్.. న్యూడ్ మ్యూజ్… మెచ్యూరిటీ చూపులు
ప్రేమ, ఆరాధనల బలవంతంలేని డిగ్నిఫైడ్ లుక్స్
హాయినిచ్చే ప్రాణం పోసే అనుమతితో కైఫెక్కే చూపులు
చూసీచూడని నలుగురిలో నలిపేయని
మోకాళ్లపై కూలబడి గౌరవంగా
పువ్వుల్లా విప్పారి ఆప్యాయంగా
సున్నితంగా తలవాల్చే కొంటెతనంగా పక్కకుతిరిగే చూపులు
చల్లార్చాలిప్పుడు బడబాగ్నిని… దహించాలిపుడు కాలకూటాన్ని

ఆ కొన్ని వికృతమైన చూపుల్ని చంపేసుకురావాలి
లేకుంటే… కళ్లతోపాటు వెనకున్న మెదడుని
కిందున్న అంగాన్ని నడిరోడ్డున పొడిచిపారేసే
వీధుల్లో ఉరితీసే అసలు సిసలు ఆడదనాన్ని కళ్లారాజూస్తాం
రొమ్ము వెనుక మరుగుతోన్న హృదయమూ ఉంది
పిరుదులపైన స్రవిస్తోన్న మన జన్మస్థానముంది
మగతనానికే కాదు, మరో తరానికి అమ్మదనం ఉండదూ
పుట్టగతులూ లేవు…. ఇక దృష్టి పెట్టండి…

Ajay kumar varala