home page

RS.ప్రవీణ్ కుమార్ విషయంలో KCR ఆ తప్పు చేస్తారా..?

 | 
KCR

 గురుకుల శాఖ డైరెక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నాట్టు ప్రకటించారు. వాలంటరీ రిటైర్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆయన గత 26 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మొదట చాలా కాలం పాటు పోలీసు శాఖలో పనిచేసిన ఆయన.. ఆ తర్వాత సాంఘిక సంక్షేమ హాస్టళ్ల డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు.


అయితే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎక్కడికెళ్లినా.. దళిత సంక్షేమంపై మాట్లాడుతున్నారు కేసీఆర్. నిన్ననే దళిత బంధు పేరుతో ఓ స్కీం ప్రకటించారు సీఎం. 


దీంతో హుజురాబాద్ ఎన్నికలు మొత్తం దళిత సంక్షేమం చుట్టూరే తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రవీణ్ కుమార్ రాజీనామా హాట్ టాపిక్ అయ్యింది. హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ తరుపున ప్రవీణ్ కుమార్ ను బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్ కుమార్ కు కేసీఆర్ తో మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి.. ఖచ్చితంగా హుజురాబాద్ కోసమే ప్రవీణ్ కుమార్ తో రాజీనామా చేయించారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.


అయితే.. ఇది సాధ్యమయ్యే అవకాశాలు మాత్రం లేవు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను దళిత ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ కు పడే ఛాన్స్ ఉందనేది వాస్తవమే. కానీ ప్రవీణ్ కుమార్ హిందూ వ్యతిరేకి అనే బలమైన ముద్ర గతంలోనే వేసింది బీజేపీ. హిందూ మతానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారంటూ చాలాసార్లు ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా బీజేపీ అనుబంధ సంఘాలు ఆందోళనలు చేశాయి. ప్రవీణ్ కుమార్ దిష్టిబొమ్మలు దహనం చేశాయి.


ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రవీణ్ కుమార్ ను హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెడితే.. బీజేపీకి ఓ అస్త్రాన్ని అప్పజెప్పినట్టే అవుతుంది. కేసీఆరే స్వయంగా టీఆర్ఎస్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీసుకున్నవారు అవుతారు. అప్పుడు దళితులు మినహా.. ఇతర సామాజిక వర్గాల ఓట్లు టీఆర్ఎస్ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. 


అందుకే  ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవీణ్ కుమార్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు లేవనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఒకవేళ పోటీ చేస్తే.. ప్రవీణ్ కుమార్ ఇండిపెండెంట్ గా గానీ.. BSP వంటి ఏదైనా పార్టీ నుంచి గానీ పోటీ చేసే అవకాశాలున్నాయని టాక్.