home page

మంగ్లీ యూ ఆర్ గ్రేట్.. గల్లీ టూ ఇంటర్నేషనల్.. మాస్ టూ డెవోషనల్..

 | 
మంగ్లీ యూ ఆర్ గ్రేట్.. గల్లీ టూ ఇంటర్నేషనల్.. మాస్ టూ డెవోషనల్..

ఆస్తికత్వం , నాస్తికత్వం, భాష, జాతి,వర్ణం, దేశం అన్నీ పక్కన పెట్టి "జాగరణ" అంటే ఏమిటో కూడా తెలియని వారు సైతం నిద్రను సైతం పక్కన పెట్టి పన్నెండు గంటలకు పైగా యూట్యూబ్ లైవ్ లో ప్రపంచ వ్యాప్తంగా వీక్షించే ఒకే ఒక కార్యక్రమం సద్గురు నిర్వహించే శివరాత్రి కార్యక్రమం.

సంగీతం, కళలు అంటే అంటే ఇష్టం లేని వారు సైతం టివి ముందు నుండి కదలని ఒకే ఒక కార్యక్రమం. దేశంలోని విభిన్న ప్రాంతాల్లోని కళాకారులని ప్రపంచానికి పరిచయం చేస్తున్న వేదిక. ఎంత పని ఉన్నా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అమెరికా నుండి లైవ్ లో చూసే లక్షలాది వీక్షకుల్లో నేనూ ఒకడిని.

ఈ రోజు ఈ కార్యక్రమంలో అనుకోకుండా మంగ్లీ పేరు రావడం ఆశ్చర్యం, ఆనందం కలిగింది. అప్పుడెప్పుడో V6 ఆఫీసులో ప్రోగ్రాం కోఆర్డినేటర్ దామోదర్ తో మాట్లాడుతుంటే పక్కనే అమాయకంగా నిలబడి చూస్తున్న తీన్మార్ మంగ్లీ అలియాస్ సత్యవతి .. ఈ రోజు సద్గురు ముందు పాడుతుంటే చాలా సంతోషం అయ్యింది. ఆ తర్వాత అమెరికాలో తెలుగు ప్రోగ్రాం లకు వచ్చినప్పుడు మా ఫ్యామిలీ తో కలసి తిరిగిన మంగ్లీ ఈ రోజు సద్గురు కార్యక్రమంలో పాడుతుంటే ఒక ఉద్వేగం!

మొదటి సారి మైక్ టీవీ mictv.in లో పాడిన పాట యూట్యూబ్ లో వేలకొలది హిట్స్ వస్తుంటే .. "బాగా పాడావ్ మంగ్లీ అని అభినందిస్తే " సంతోషం కన్నా విచారం వినిపించింది ఆమె మాటల్లో. ఎందుకంటే .. "ఆ పాట నేను పాడిన అంటే ఎవ్వరూ నమ్మట్లేరు అన్నా" అంది బాధగా. "ఎవరేమనుకుంటే నీకే.. నువ్వు పాడుతూనే ఉండు, ప్రపంచమే గుర్తిస్తుంది" అని చెప్పడం గుర్తుంది కొన్ని సంవత్సరాల క్రితం . ఇపుడు సద్గురు లాంటి వరల్డ్ ఫేమస్ కార్యక్రమంలో పాడుతూ అందరిని తన్మయత్వం తో ఒక ఊపుతుంటే ఆపుకోలేని ఆనందంతో మంగ్లీ గురించి ఈ రెండు మాటలు రాయకుండా ఉండలేక పోయాను.

మంగ్లీ ..అనబడే సత్యవతి V6 తీన్మార్ నుండి ప్రారంభమయిన జర్నీ బతుకమ్మ పాటల తో యూట్యూబ్ లో వంద కోట్ల పైగా వ్యూస్ తో దుమ్ము రేపింది. ఇప్పుడు సినీ నేపధ్యగాయనిగా దుమ్ము రేపుతోంది . సరిలేరు నీకెవ్వరూ, క్రాక్ సినిమాల్లో భూమి బద్దలైపోయేలా తన గాత్రం తో అదర గొట్టింది. ఇప్పుడు సద్గురు శివరాత్రి కార్యక్రమంలో చోటు సంపాదించుకోవడం నిజంగా తెలుగు వాళ్లందరికీ ఒక గర్వకారణం.

వేములవాడ రాజన్న, కొమురవెల్లి మల్లన్న ... తెలంగాణకే పరిమితం అయిన పేర్లు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగించిన ఘనత మంగ్లీ పాటకే చెందింది.

గోరెటి వెంకన్న Gorati Venkanna, మాట్ల తిరుపతి Thirupathi Matla లాంటి ప్రముఖ తెలంగాణ రచయితల పేర్లు ఒక అంతర్జాతీయ వేదిక మీద వినిపించడం కూడా చాలా సంతోషంగా ఉంది .

మరిన్ని మంచి అవకాశాలతో మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ .. ఆల్ ది బెస్ట్ మంగ్లీ!

- వేణు నక్షత్రం