home page

బీజేపీలోకి ఈటెల.. సరే.. మరి ఎన్నాళ్ళు  ఈ ప్రయాణం.. ? 

 | 
BJP Etela

గత కొన్ని రోజులుగా సస్పెన్స్ ధ్రిల్లర్ గా కొనసాగుతున్న మాజీ మంత్రి ఈటెల ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చింది. కాషాయం కండువా కప్పుకోవడానికి ఈటెల అన్నీరకాలుగా సిద్ధమైపోయారు. కేంద్రంలోని బీజేపి నేతలతో భవిష్యత్తు కార్యాచరణపై తీవ్రంగా చర్చించి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 8 లేదా 9 న ఆయన బీజేపీలో చేరనున్నారు.

అయితే బీజేపీతో ఈటెల ప్రయాణం ఎన్నాళ్ళు? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. బలమైన బీసీ నేతగా ఈటెలకు మంచి పేరుంది. అలాంటి నేతలు ఇప్పుడు బీజేపీలో కూడా ఎదుగుతున్నారు. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ లాంటి నేతలు తెలంగాణ బీజేపీకి పెద్ద తలకాయలుగా వ్యవహరిస్తున్నారు. ముందునుంచి పార్టీలోనే ఉన్నారు.

ఇప్పుడు ఇందులో ఈటెల కలవబోతున్నారు. వయసు దృష్ట్యా, అనుభవం దృష్ట్యా బండి సంజయ్, ధర్మపురి ఆర్వింద్ ల కంటే ఈటెల సూపర్ సీనియర్.  ఇప్పుడు ఈ జూనియర్స్ కింద సీనియర్ అయిన ఈటెల ఎంతవరకు ఉండగలడు అన్నది మొదటి ప్రశ్న ?

అటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ నేతలు పదేపదే చెప్పుకుంటూ వస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఈటెలకి బీజేపి అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని ఇస్తుందా? అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటికే ఆ పోస్ట్ కోసం కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నాయకులు కర్చీఫ్ వేసుకొని వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ పదవికి రాజీనామా చేసి వారు ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారు. సో ఈటెలకి మహా అయితే ఏదోక మంత్రి పదవి దక్కుతుంది. 

టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత కేవలం ఈటల రాజేందర్ కు మాత్రమే ఉందని గతంలో కామెంట్స్ చేసిన ధర్మపురి అర్వింద్ ఇప్పుడు అవే కామెంట్స్ ను ఈటెల  బీజేపీలోకి వచ్చాక అనలేని పరిస్థితి ఉంది. 


అంతేకాకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి సీఎం పదవిని బీజేపి అధిష్టానం కట్టబెట్టిన దాఖలాలు దాదాపుగా లేవు. ఈటెల బీజేపీ లోకి వెళ్లడం వల్ల అంతోకొంతో బీజేపికి ప్లస్ అవుతుందే తప్పా.. ఈటెలకి పెద్దగా ఒరిగేదేమీ లేదని అంటున్నారు రాజకీయ నిపుణులు. 

మహ అయితే కేసుల నుంచి ఈటెలకి కొంచం ఊరట లభించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీని పైన టీఆర్ఎస్ నాయకులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరితే అది ఆత్మ గౌరవమా అని ప్రశ్నిస్తున్నారు.