బడ్జెట్ లో అంతా మాంద్యమే

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. 2019-20 ఆర్థిక సంవత్సరానికి లక్షా 46వేల 492 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 17వేల 274 కోట్లుగా చూపించారు. బడ్జెట్ అంచనాల్లో మిగులు 2వేల 44 కోట్లు, ఆర్థిక లోటు 24వేల 81 కోట్లుగా ఉందని చెప్పారు. రైతు బంధు కోసం 12వేల కోట్లు, రైతు బీమా ప్రీమియం చెల్లింపుల కోసం 11 వందల 37 కోట్లు, రుణ మాఫీ కోసం 6వేల కోట్లు, విద్యుత్ సబ్సిడీల కోసం 8వేల కోట్లు కేటాయించారు. ఆసరా ఫించన్ల కోసం 9వేల 402 కోట్లు ఇచ్చారు.

మొత్తం బడ్జెట్ :1,46,492.30 కోట్లు

రెవెన్యూ వ్యయం: 1,11,055.84కోట్లు

మూలధన వ్యయం :17,274.67 కోట్లు

మిగులు :2,044.08 కోట్లు

ఆర్థికలోటు : 24,081 కోట్లు

ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టంగా ఉన్న ఈ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్టు చెప్పారు సీఏం కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకొచ్చిన విధానాలనే అనుసరించడం తప్ప.. మరో మార్గం లేదన్నారు. ఆర్థిక మాంద్యంతో పన్ను రాబడులు తగ్గినా.. పథకాలను యదాతథంగా కొనసాగిస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు.
బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా ఆర్థిక మాంద్యంపైనే ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో 5 శాతం వృద్ధి రేటుతో ఆర్థిక ప్రగతి తగ్గిందన్నారు. అన్ని రంగాలపై ఆర్థికమాంద్యం ఎఫెక్ట్ తీవ్రంగా పడుతోందని, కొన్ని రంగాలు పూర్తి నిరాశజనకంగా ఉన్నాయన్నారు. ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని.. వాహనాల ఉత్పత్తి 33 శాతం పడిపోయిందని చెప్పారు.