బతుకమ్మ చీరలను అడ్డుకోకండి

బతుకమ్మ చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయడంతో హైకోర్టును ఆశ్రయించారు కోరుట్లకు చెందిన సోషల్ వర్కర్స్. 280 కోట్ల రూపాయల ప్రజాధనంతో తయారుచేయించిన బతుకమ్మ చీరలను ప్రభుత్వాధికారులతో ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన దాదాపు 96 లక్షల చీరలు ఈసీ ఆదేశాలతో మూలనపడుతాయని… దీంతో ప్రజాధనం వృధా అవుతుందని అభిప్రాయపడ్డారు.

తమ పిటిషన్ ను సుమోటాగా స్వీకరించి… తగు విచారణ చేపట్టి ప్రజాధనం వృధా కాకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు. గతేడాది ప్రవేశపెట్టిన పథకమే కాబట్టి… ఎన్నికల కోడ్ వర్తించదని పిటిషన్ లో గుర్తు చేశారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వాధికారులతో బతుకమ్మ చీరలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధనం వృధా కావొద్దన్నదే తమ అభిప్రాయమని… తాము ఏ రాజకీయ పార్టీకి చెందినవారము కాదని పేర్కొన్నారు.