సెలవుల పొడిగింపు బస్సులు లేక కాదు.. అసలు కథ ఇది..!

ఆర్టీసీ సమ్మెను నీరుగార్చడంలో సీఎం కేసీఆర్ ఓ విధంగా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. కార్మికులకు ఇచ్చిన హామీల విషయాన్ని పక్కనపెడితే.. తన వ్యూహాలతో ఉద్యమ తీవ్రతను తగ్గించడంలో కొంత వరకు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. ముందునుంచీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు కేసీఆర్. ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన మార్క్ చూపిస్తున్నారు.
రాష్ట్రంలో జరిగిన ఉద్యమాలను ఓ సారి పరిశీలిస్తే.. ప్రతీ ఉద్యమంలోనూ విద్యార్థులదే కీలకపాత్ర. రాజకీయ నాయకులు, ప్రజానాయకులు ఉద్యమాన్ని ప్రారంభించినా.. దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది మాత్రం విద్యార్థియోధులే. అది తొలిదశ తెలంగాణ ఉద్యమమైనా.. మలిదశ ఉద్యమమైనా.. విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనదనే చెప్పుకోవాలి. ఇవి మాత్రమే కాదు చాలా పోరాటాలకు విద్యార్థులు నూతనోత్తేజాన్నిచ్చారు.
అయితే.. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో మాత్రం విద్యార్థులు.. విద్యార్థి సంఘాల పాత్ర పెద్దగా కనిపించడం లేదు. కార్మికుల పోరాటానికి రెండు రోజుల క్రితం ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. కానీ విద్యార్థి సంఘాలు పూర్తిస్థాయిలో ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండలేకపోతున్నాయి. దీనికి ఓ ప్రధానకారణం ఉంది.
ఆర్టీసీ సమ్మె ప్రారంభమయ్యే సమయానికి దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. యూనివర్సిటీలు, కాలేజీలు మూతపడ్డాయి. ఈ నెల 14తో సెలవులు ముగియాలి. విద్యార్థులంతా తిరిగి వర్సిటీలకు, కాలేజీలకు చేరుకోవాలి. కానీ అలా జరగలేదు. సెలవులను 19 వరకు పొడిగించారు. దీనిపై కొందరు విద్యార్థులు కోర్టుకెక్కారు. హైకోర్టులో కేసు విచారణకు వచ్చినా.. పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది సర్కారు.
అయితే.. కేవలం విద్యార్థులు, ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది అవుతుందనే ప్రభుత్వం సెలవులు పొడిగించిందని మొదట అంతా భావించారు. కానీ.. ఇందులో కీలక అంశం దాగుందనే విషయాన్ని గుర్తించలేకపోయారు. యూనివర్సిటీలు, కాలేజీలు తెరుచుకుంటే.. విద్యార్థులంతా ఒక్కచోట చేరతారు. కార్మికుల సమ్మె గురించి చర్చిస్తారు. వారికి అండగా ఉద్యమానికి ఊపిరిగా మారతారు. సర్కారుకు చుక్కలు చూపిస్తారు. ఇప్పటికే లాక్కోలేక పీక్కోలేక తిప్పలు పడుతున్న సర్కారుకు.. విద్యార్థులు రంగ ప్రవేశం చేస్తే మిట్టమధ్యాహ్నం చుక్కలు కనిపించకమానవు. అందుకే కాలేజీలకు సెలవులు పొడిగించారనేది ప్రస్తుతం గులాబీ సర్కిళ్లలో జరుగుతున్న ఇంటర్నల్ చర్చ.