home page

నేను తెలుగు జర్నలిస్టును.. కాదు.. కాదు.. కట్టు బానిసను.. సన్నాసిని..!!

తెలుగు జర్నలిస్టుల కన్నీటిగాథ..
 | 
నేను తెలుగు జర్నలిస్టును.. కాదు.. కాదు.. కట్టు బానిసను.. సన్నాసిని..!!

- కరోనా కాలంలో జర్నలిస్టుల కష్టాలు

-  పట్టించుకోని మేనేజ్ మెంట్లు

- గాలిలో దీపంలా జర్నలిస్టుల ప్రాణాలు

 

నేను తెలుగు జర్నలిస్టును..

కాదు .. కాదు..

మీడియా సంస్థల ఓనర్లకు నేను కట్టు బానిసను..

నేను తెలుగు జర్నలిస్టును..

అందరిని ప్రశ్నిస్తానని గప్పాలు కొట్టే తుపాకీ రాముడిని..

కనీసం నా కోసం.. మేనేజ్ మెంట్ ను ప్రశ్నించలేని ఓ కట్టు బానిసను..

..

కరోనా కష్టకాలంలో.. కల్లోల పరిస్థితుల్లో.. పెళ్లాం.. పిల్లల్ని వదిలేసి.. అమ్మానాన్నల్ని వదిలేసి..

ఆఫీసే పరమావదిగా.. ఉద్యోగమే దైవంగా పనిచేసే కట్టు బానిసను..

మహమ్మారి మారణహోమం సృష్టిస్తున్నా..

దేశమంతా తాళం పడినా..

నేను జర్నలిస్టునని చెప్పుకుంటూ ఆఫీసుకు పరుగులు పెట్టే కట్టు బానిసను..

వైరస్ సోకితే ప్రాణాలు పోతాయని తెలిసినా..

నెల జీతం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న కట్టు బానిసను..

ఇచ్చే అరకొర జీతం కోసం.. అన్నీ వదిలేసి ఆఫీసులో పని.. పని.. అని అరుపులు కేకలు పెట్టే అభాగ్యుడిని..

ఏళ్లకేళ్లుగా పైసా పెంచకున్నా.. ఇచ్చే ముత్తెమంత జీతం కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి..

కీ బోర్డు కట్కలు ఒత్తే..  ఓ పేద్ద కట్టుబానిసను..

..

కరోనా పేరుతో జీతాలు కోత పెట్టినా..

పని గంటలు పెంచినా.. ఇదేమని ప్రశ్నించలేని దద్దమ్మను..

సెలవులు ఇవ్వకున్నా..

సరే సార్.. అంటూ సెల్యూట్ కొట్టే అడ్డగాడిదను..

..

ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తానని చెప్పి... కనీసం జీతం పెంచమని మేనేజ్ మెంట్ ను అడగలేని ఓ నిర్భాగ్యుడిని..

అందరి హక్కుల గురించి మాట్లాడే జర్నలిస్టును..

నాకు ఉన్న హక్కులను సాధించుకోలేని.. కనీసం మాట్లాడలేనివాడిని..

ఉద్యోగ భద్రత లేదని తెలిసీ.. ఊడిగం చేస్తున్న చెప్రాసీని..

కరోనా కల్లోలంలో కనీసం ప్రాణాలకు రక్షణ కల్పించమని మేనేజ్ మెంట్లను ప్రశ్నించే ధైర్యంలేని ఓ పిరికివాడిని..

..

కరోనాతో తోటి వారు అల్లాడుతున్నా..

మన పక్క కుర్చీలో కూర్చునే వాడిని కరోనా వైరస్ మింగేసినా..

కనీసం.. అయ్యో పాపం అనలేని అభాగ్యుడిని..

తోటి ఉద్యోగి మరణానికి సంతాపం తెలపలేని సన్నాసిని..

..

ఉస్కో అంటే ఉరికే వేట కుక్కలాగా..

ఇంచార్జులు చెప్పగానే..

బ్రేకింగులు.. లైవ్ లంటూ బీపీలు, షుగర్లు పెంచుకునే బేకార్ గాన్ని..

కరోనా సోకితే ఖతమని తెలిసినా..

ఐసోలేషన్ వార్డుల్లోకి వెళ్లి లైవులిచ్చి అదే గొప్పతనమనుకునే వాడిని..

కరోనా సోకి మంచాన పడితే.. ఆఫీసు పట్టించుకోక అయ్యో రామచంద్రా అని గుండెలు బాదుకునే వాడిని..

..

అవును..

పేరుకే నేను జర్నలిస్టును..

మేనేజ్ మెంట్ల పక్షాన పార్టీల జెండా, ఎజెండా మోస్తున్న బోయడిని..

పార్టీల రంగు పూసుకుని.. వాటికి ఊడిగం చేస్తున్న ఓ ఖరడు గట్టిన కార్యకర్తని..

..

అయినా.. నేను జర్నలిస్టునే...

కాదు.. కాదు..

మీడియా సంస్థల మేనేజ్ మెంట్లకు కట్టుబానిసను..

నెల జీతం కోసం కుటుంబాన్ని పణంగా పెడుతున్న సన్నాసిని..

ఎప్పటికీ మారని.. ఓ కట్టుబానిసని.

.. ఓ తెలుగు జర్నలిస్టు