Tv9 Devi Nagavalli : Tv9 దేవి అక్కకు ప్రేమతో రాయునది…!
Latest Off Beat

Tv9 Devi Nagavalli : Tv9 దేవి అక్కకు ప్రేమతో రాయునది…!

Letter To Tv9 Devi Nagavalli : ప్రియాతి ప్రియమైన టీవీ9 దేవక్క గారికి నమస్కరించి రాయునది..

తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగానే ఉన్నారు.. మీరు బాగానే ఉన్నారని తలస్తున్నాము. మీరు బాగుండాలి. బాగుంటారు నాకు తెలుసు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటి దాకా బాగానే ఉన్నారు. కానీ ఇకపై ఏమౌతారోనని బెంగ పట్టుకుంది. కలరా, డెంగీ మొన్నీ మధ్య కరోనా వచ్చినా తట్టుకున్న తెలుగు ప్రజలు.. దీన్ని మాత్రం తట్టుకోలేక తల్లడిల్లి పోతున్నారు. ఎంత గుండెధైర్యం తెచ్చుకుందామన్నా వారితో కావడం లేదట. ఎవరికీ చెప్పుకోవాలో వారికి తెలియడం లేదట.

ఇవన్నీ నాకెందుకు లెటర్ రాస్తున్నారని మీకు అనుమానం కలగొచ్చు.

అక్కా.. టీవీ9 దేవక్కా…

వీటన్నింటికి మీరే కారణం కాబట్టి.. మీకు లేఖ రాయక తప్పడం లేదు.

ఆ టీవీ9 తెరపై చాలా ఏళ్లుగా నిన్ను చూస్తున్నాం. నువ్వు వార్తలు చదవడం చూస్తున్నాం. కానీ ఈ మధ్య నీకు ఏమైందో ఏమో గానీ వింత వింతగా మాట్లాడేస్తున్నావ్.

ఆ మధ్య పోయినేడు హైదరాబాద్ కు వరదలొచ్చినప్పుడు అనుకుంటా.. వర్షాలు పడితే భూమ్యాకర్షణ శక్తి  కట్ అయిపోతుందని ఫిజిక్స్ లో కొత్త థియరీ చెప్పావు. అలా ఎలా..? అని భౌతికశాస్త్రవేత్తలు జుట్టు పీక్కుని.. పీక్కుని వాళ్లకు బోడి గుండు అయ్యిందట.

అదయ్యిందనుకునే లోపే.. టీవీ9 కొత్త స్టూడియోలో రుధిరాన్ని పారించావు. అది ఎందుకు పగబట్టిందో..? ఎప్పుడు విరిగి మా పై పడుతుందో తెలియక.. ఇప్పటికీ భయం భయంగా.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం.

వర్షంలోకి ఆ రుధిరం ఎందుకొచ్చిందో.. నీకు స్ర్కిప్ట్ ఇచ్చిన సబ్ ఎడిటర్ అలా రాశాడో.. లేక నువ్వే పదం బలంగా ఉందని వాడావో తెలియదు గానీ.. రుధిరమనే పదం ఎంత గబ్బులేపిందో చూశావ్ కదక్కా.

రుధిరాన్ని మరిచిపోదామనే లోపే మరోటి వదిలితివి.

లీటర్ పెట్రోల్ కొట్టిస్తే 100 ఎంఎల్ కాదు.. 950 ఎంఎల్ వస్తుందని చెప్పితివి.

నాకు తెలిసి ఇక్కడ కూడా స్క్రిప్ట్ రాసిన సబ్ ఎడిటరే ఏదో తప్పు చేసుంటాడు. పక్కన మరో సున్నా పెట్టడం మరిచిపోయి ఉంటాడు. అందుకే 1000 కాస్త వంద అయ్యింది. అయినా నువ్ ఎంత సీనియర్ జర్నలిస్ట్ వు. కాస్త చూసుకోవాలి కద దేవక్కా.

నువ్ బిగ్ బాస్ కు పోయి వచ్చాక ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు. నువ్ చేసే ప్రతీ బులిటెన్ ఖచ్చితంగా క్షుణ్ణంగా చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్.. ఇలాంటి బాంబులు పేలిస్తే ఎలా అక్కా..?

మేము ఏమై పోవాలి.. ఏ రుధిరంలో కొట్టుకుపోవాలి..?

మా భూమ్యాకర్షణ శక్తి ఏమైపోవాలి..?

నంబర్ వన్ ఛానల్.. ఎక్కువమంది చూసే ఛానల్ మీదేనని చెప్పుకుంటున్నరు కదా.. అలాంటప్పుడు ఇలాంటివి దొర్లితే సోషల్ మీడియాలో ట్రోల్ వీరులు ఖాళీగా ఎందుకు కూర్చుంటారు అక్క.

యూట్యూబ్ లో ఫన్నీ వీడియోలున్నాయి.

చేతిలో వీడియో ఎడిటింగ్ యాప్ లున్నాయి.

ఫన్నీ.. ఫన్నీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లున్నాయి.

ఇవన్నీ ఉండగా వాళ్లు మిమ్మల్ని ట్రోల్ చేయకుండా ఎలా ఉంటారనుకున్నావ్ దేవక్కా.

ప్లీజ్ దేవక్కా.. బులిటెన్ కి వచ్చేటప్పుడు కాస్త స్క్రిప్ట్ లు చదువుకుని రా. లేకపోతే స్క్రిప్ట్ ప్రింట్ తీసుకుని ఆ పేపర్లు పట్టుకుని అయినా చదువు. లేకపోతే ఆ టెలీ ప్రాంప్టర్ అయినా సరిగా చూసి చదవడం నేర్చుకో అక్క

లేకపోతే..

సోషల్ మీడియాలో మీ మీద వచ్చే ట్రోలింగ్స్ చూసి తట్టుకోలేకపోతున్నాను దేవక్కా. ఒక్కో ట్రోలింగ్ వీడియో చూస్తున్నప్పుడు.. నా గుండె.. హైదరాబాద్ లోని ఒక్కో చెరువవుతోందక్క.

అక్కా..

చెబితే తప్పుగా అనుకుంటున్నావ్ కావచ్చు.

కానీ ఓ సారి యూట్యూబ్ తెరిచి చూడక్కా.. నీ మీద ఎన్ని ట్రోలింగ్ వీడియోలున్నాయో..? నీ పేరు చెప్పుకుని చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారక్క యూట్యూబ్ లో. వాళ్లకు ఆదాయ మార్గం చూపించిన నీ మనసు పెద్దదే. కానీ నిన్ను తిడుతూ కింద కామెంట్లు పెడుతున్నారు చూడు.. అవే బాధ కలిగిస్తున్నాయక్క.

ప్లీజ్.. టీవీ9 దేవక్కా.. నా కోసం అయినా ఇకపై రుధిరాలు పారించకు.. భూమ్యాకర్షణ శక్తిని కట్ చేయకు.. లీటర్ లో ఉన్న వెయ్యి మిల్లీలీటర్లను 100 మిల్లీలీటర్లకు తగ్గించకు.

ప్లీజ్…. అక్క

  ఇట్లు

                                                                  టీవీ9 దేవీ నాగవల్లీ అక్క అభిమాని

 

Read Also :