ఈ ‘బుల్లెట్టు’ బండి వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది..!
Latest Off Beat

ఈ ‘బుల్లెట్టు’ బండి వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది..!

2004లో శేఖర్ కమ్ముల గారు ‘ఆనంద్’ సినిమా తీశారు. పెళ్లిలో తనకు కాబోయే కోడలు తన మాట వినలేదన్న అక్కసుతో ఓ అత్తగారు అంటుంది.. “మా బిరాదరీలో పెళ్లి కూతురు నోరు ఎత్తి మాట్లాడటమే పాపం!” అని. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి అతనితో పెళ్లి మానుకుంటుంది. ఆ తర్వాత తనకు నచ్చిన వాణ్ణి చేసుకుంటుంది. 15 ఏళ్లు గడిచాయి. 2021లో తన పెళ్లి బరాత్‌తో భర్తతో కలిసి ఓ పెళ్లి కూతురు ‘బుల్లెట్టు బండి’ పాటకు డ్యాన్స్ చేయడం వైరల్ అయ్యింది. కోటి మందికి పైగా ఆ వీడియో చూశారు. ఆ సినిమాలో అత్తగారు ఇవ్వనిది, ఈ వీడియోలో పెళ్లి కూతురు పొందింది ఏమిటో అర్థమైందా? స్వేచ్ఛ. అర్థం చేసుకునే మనుషులు.

కళాకారులు రాబోయే కాలాన్ని ముందుగా అంచనా వేయగలరు. Recording Something is not only the work of a Writer. రాబోయే కాలానికి జనాన్ని సంసిద్ధం చేయడం కూడా అతని పనే! ఈ కారణం వల్లే సెన్సార్ షిప్ మీద నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల గారికంటే ముందే తెలుగులో బాపు, తమిళంలో కె.బాలచందర్ రాబోయే కాలాల్లో స్త్రీల గురించి Predict చేస్తూ కొన్ని సినిమాలు తీశారు. అదంతా మనకు తెలిసిందే!

వైరల్ అయిన వీడియో వెనుక కారణాల విశ్లేషణ అవసరం లేదు కానీ, ఆ వీడియో ద్వారా రెండు అంశాలు మనం గ్రహించాలనేది నా అభిప్రాయం.

Also Read :

* కాలం ఎంత మారుతున్నా పెళ్లి & బంధాల పట్ల జనాల్లో ఇంకా Positive Attitude ఉంది. లేకపోతే అంత సహజంగా భావ వ్యక్తీకరణ రాదు. స్త్రీ తన స్వేచ్ఛని, ఆహ్లాదాన్నీ అనుభవించగలిగేది చుట్టూ ఉన్న వాతావరణం, ఏర్పడ్డ బంధాల ద్వారానే! ఆ వీడియోలో భార్యాభర్తల మధ్య ఆ నమ్మకం, గౌరవం ఉండబట్టే ఆ వీడియో రొటీన్ పెళ్లి Cover Songsలాగానో, అసహజమైన Wedding Shoot లాగానో మిగిలిపోకుండా ఉంది. ‘నీపై నాకు నమ్మకం, గౌరవం ఉన్నాయని’ భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల ప్రవర్తన, వ్యక్తిత్వం అలా ఉండాలి.‌

* ఈ మధ్య కాలంలో సినిమా పాటల మీద జనం విసిగిపోయిన స్థితికి ఆ వీడియో వైరల్ అవడం ఒక ఉదాహరణ. ‘నాదీ నక్కిలేసు గొలుసు’, ‘నీలినీలి ఆకాశం’, ‘నీ నవ్వు నీలి సముద్రం’ పాటల తర్వాత నాకు తెలిసి ఏ తెలుగు సినిమా పాటా జనాన్ని అంతగా ఆకట్టుకోలేదు. వస్తున్నాయి. వెళ్తున్నాయి. పెద్ద హీరోల సినిమాల్లోని పాటలు కూడా విని వదిలేయడం తప్ప, పాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు జనం కొత్తదనం కన్నా హాయిదనం కోరుతున్నారనిపిస్తుంది. ముఖ్యంగా పల్లె పదాలు, జనవాక్యాలు, సింపుల్ రాగాలు.. వీటి మీద మనసు పడ్డారు. అలాగని అన్నీ అలా ఉన్నా నచ్చుతాయని చెప్పలేం! కాకపోతే కాపీ ట్యూన్స్, అసహజ పదాలు పెట్టి ఊదరగొట్టే పాటల్ని మాత్రం వచ్చినదారినే సాగనంపుతున్నారు.

ఇవి రెండూ నాకు అర్థమైనవి. పూర్తిగా నా ఆలోచనలే! ఇప్పుడు అసలు టాస్క్ మొదలవుతుంది. ఒక పెళ్లి వీడియో వైరల్ అయ్యిందని ఇక రేపటి నుంచి ప్రతి పెళ్లిలో ‘బుల్లెట్టు బండి’ పాట వేసి డ్యాన్స్ చేసి, దాన్ని వీడియో తీసే కార్యక్రమం ఒకటి చేస్తారు. చేయొచ్చు! తప్పేమీ లేదు. కానీ అన్నీ వైరల్ అవ్వవు. అవ్వలేవు. కొన్ని మాత్రమే అసంకల్పిత సంభవాలు. అవి అలా తెలియకుండా జరిగిపోతాయి కాబట్టే వాటిలో ఆ సహజత్వం ఉట్టిపడుతుంది. వాటికి విలువ వస్తుంది. మనమూ అది కాపీ కొట్టాలని చూస్తే ఎవరూ కాదనరు. కానీ చూసి పక్కకు తప్పుకుంటారు. అసలేదో, నకిలీ ఏదో తేల్చేది సిసలైన జనాలే!

Credit : 

Sai Vamshi (Facebook)