home page

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!!

ప్రజలను పట్టించుకోని మీడియా
 | 
telugu media irresponsible behavior in covid pandamic

రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. పాజిటివ్ కేసులే కాదు... మరణాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.

కరోనా తీవ్రత చూసి ప్రజలు వణికిపోతున్నారు. కరోనా కంటే కూడా ఇప్పుడు హాస్పిటల్ బిల్లులు చూసే ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్పుకోవాలి. కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినా.. వాళ్లు వేసిన బిల్లు చూసి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది.

2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచే ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీ మొదలైంది. ఫస్ట్ వేవ్ కాస్త కంట్రోల్ అయ్యాక వీళ్ల దోపిడీకి పుల్ స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. కానీ.. సెకండ్ వేవ్ మొదలవ్వడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీకి గేట్లు ఎత్తినట్టైంది.

ఈ జిల్లా... ఆ జిల్లా అని లేదు. ప్రతీ చోట ఇదే దందా. ఆక్సీజన్ బెడ్ అయితే ఇన్ని లక్షలు. వెంటిలేటర్ అయితే ఇన్ని లక్షలు. నిన్న మొన్నటి వరకు ఇంజెక్షన్ సరిగా వేయరాని వాడు కూడా ఇప్పుడు కొవిడ్ హాస్పిటల్ అని బోర్డులు పెట్టి ట్రీట్మెంట్ చేసేస్తున్నాడు. ప్రజల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు.

లక్షలాది రూపాయల బిల్లులు చూసి.. ప్రతిరోజు వందలాది మంది సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. లక్షల్లో వేసిన బిల్లులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. కాపాడండి మహాప్రభో అని వేడుకుంటున్నారు.

telugu media

హాస్పిటల్స్ దోపిడీ రహస్యంగా ఎవరికీ తెలియకుండా జరుగుతోందా..?

అస్సలే కాదు.

అందరికీ తెలిసే జరుగుతోంది. ప్రభుత్వానికి, అధికారులను, లీడర్లకు తెలుసు.

అంతకు మించి మీడియాకు తెలుసు. కానీ దమ్మున్న మన ఛానళ్లు.. వాస్తవాలకు ప్రతిరూపమని చెప్పుకునే టీవీలు.. నిజం మా నైజం అనిన చెప్పుకునే టీవీలు, ప్రజల పక్షమని ఊదరగొట్టే మన మీడియా గొట్టాలు మాత్రం కిక్కురుమనవు.

గల్లీ హాస్పిటల్స్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ వరకు ఎక్కడ ఏ స్థాయిలో దోపిడి జరుగుతోందో.. చాలా మీడియా సంస్థల పెద్దలకు తెలుసు. ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి విషయాలు వరుసబెట్టి మీడియాలో కథనాలు వేస్తే.. ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడైనా దోపీడికి బ్రేక్ పడే ఛాన్స్ ఉంటుంది.

కానీ ఫలానా హాస్పిటల్ లో అడ్డగోలుగా చార్జీలు వేస్తున్నారని వార్తలు రాయరు. గుట్కాలమ్మితే, ట్రాఫిక్ పోలీసాయన వంద రూపాయలు లంచం తీసుకుంటే స్టింగ్ ఆపరేషన్లు చేసే మన మీడియా మేధావులు.. ఈ హాస్పిటల్స్ కు వెళ్లి స్టింగ్ ఆపరేషన్లు చేయరు.

telugu news media

ఒకవేళ చేసినా.. అది టీవీ స్క్రీన్ దాకా రాదు. ఎందుకంటే దానికి చాలా యవ్వారాలుంటాయి. బేరసారాలుంటాయి. వార్త వేస్తే ఏమొస్తుంది..? ఒక్కరోజు హడావుడి తప్ప.. అదే కూర్చుని మాట్లాడుకుంటే అంతా సెట్ రైట్ అయిపోతుంది. మరీ యవ్వారం పూర్తిస్థాయిలో సెట్ కాకపోతే... పలానా సిటీలో ఓ కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీ అని రాస్తారు తప్ప.. ఎక్కడ ఆ హాస్పిటల్ పేరు చెప్పరు. ఫొటోలో, వీడియోలో కూడా చూపించరు.

ప్రస్తుతం మీడియా ప్రతినిధులు హాస్పిటల్స్ లోకి రహస్యంగా వెళ్లి స్టింగ్ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. బాధితులే ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు.

అలాంటప్పుడు ఫలానా హాస్పిటల్ లో ఈ రకంగా దోపిడీ జరుగుతోందని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఏ మీడియా సంస్థ కూడా ఆ పని చేయదు.

ఎందుకంటే ఇప్పుడు మీడియా ప్రజల కోసం పనిచేస్తున్నది కాదు.. వారి కోసం అంటే మేనేజ్ మెంట్ ఆశయాలు, ఆకాంక్షలు, ఆర్థిక అంశాలకు అనుగుణంగా పనిచేసే ఓ మెషిన్ మాత్రమే. వాళ్లు చెప్పిందే రాయాలి. వాళ్లు భజన చేయమన్న చోట చేయాలి. బజార్లో నిలబెట్టమన్న చోట బజార్లో నిలబెట్టేలా వార్తలు రాయాలి. అంతకు మించి.. జర్నలిజం.. ఎథిక్స్.. తొక్క.. తోటకూర కట్ట.. ఓ చించేస్తాం.. పొడిచేస్తాం.. అనుకుంటే.. తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్లాల్సిందే.