Paper Leaks : తెలంగాణలో ఎన్నికల రాజకీయం మొదలైంది. పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేశాయి. సంక్షేమమే ఎజెండాగా అధికార పార్టీ మరోసారి జనం బాట పట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి అంతేస్థాయిలో చొచ్చుకెళ్తున్నాయి. దీంతో ఉగాది పంచాగం నుంచి మొదలు పెడితే సర్వేల దాకా అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకే మరోసారి అధికారం రాబోతోందని చెబుతున్నాయి. దీంతో అధికార విపక్షాల మధ్య హోరాహోరీ నడుస్తోంది. అయితే.. ఎలక్షన్ దగ్గరపడినప్పుడు ఇలాంటివన్నీ జరగడం కామన్. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం కామన్. అంతా ప్రజల్లో ఉండటం కూడా కామనే. కానీ ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయం తెరపైకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. అధికారం కోసం కొందరు వ్యక్తులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపింది. ఏకంగా సీఎం కుటుంబానికి దీంతో సంబంధముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు సిట్ నుంచి తప్పించి సీబీఐ, ఈడీకి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో బీజేపీలో యాక్టీవ్ గా తిరిగే ఓ వ్యక్తి పాత్ర ఉందని బయటపడింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న వ్యక్తే పేపర్ లీకేజీకి సహకరించారని విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సోమవారం పరీక్షలు మొదలయ్యాయి. మొదటిరోజు తెలుగు ప్రశ్నాపత్రం, రెండో రోజైన మంగళవారం హిందీ ప్రశ్నాపత్రం కూడా లీకైంది. తెలుగు పేపర్ లీకైనప్పుడే విద్యాశాఖ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. స్కూళ్లకు స్ట్రిక్ట్ గా ఆదేశాలిచ్చారు. పేపర్లు బయటకు వస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఈవోలను సైతం సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అయినా హిందీ ప్రశ్నాపత్రంకూడా బయటకు వచ్చింది.
ఇవన్నీ ఇప్పుడు సర్కారు పనితీరును ప్రశ్నించే అంశాలు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ కావడమే పెద్ద అపవాదు అయ్యింది. ఆ వెంటనే పదో తరగతి పరీక్షా పేపర్లు లీక్ కావడం మరింత పెనుదుమారంగా మారింది. సర్కారుకు తలనొప్పిగా మారింది. అయితే.. ఇది ఏదో ఒకరిద్దరు ఉద్యోగులు, టీచర్లు తమ స్వార్థం కోసం చేసింది కాదనే ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనకాల పెద్ద కుట్ర దాగుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో అతి త్వరలో ఎన్నికలున్నాయి. ఇలాంటి సమయంలో సర్కారు ప్రతిష్టను ఎంత దెబ్బతీస్తే తమకు అంత ఓట్లు పెరుగుతాయనే భావనలో కొన్ని ప్రతిపక్షాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ కుట్రల్లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే లిక్కర్ కేసు పేరుతో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ మూడు సార్లు విచారించింది. దీనిపై బీజేపీ భారీ ఎత్తున క్యాంపెయినింగ్ చేసింది. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పైనా రాష్ట్ర సర్కారును బద్నాం చేసేందుకు బీజేపీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసింది. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా తమ కాషాయ జాతీయ మీడియాలో బ్రేకింగు లేసి హడావుడి చేసింది. ఇప్పుడు పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీలోనూ కాషాయ మూకల హస్తం ఉండే ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
తమ పార్టీకి అనుకూలంగా ఉండి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారిని బీజేపీ ఎంగేజ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వారితో పేపర్ లీకేజీలు చేయించి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా జరిగితే తాము చూసుకుంటామని చెప్పి.. వారిని ఉసిగొల్పుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కఠినచర్యలుంటాయని సర్కారు హెచ్చరించినా పట్టించుకోకుండా పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారనే మాట వినిపిస్తోంది. దీంతో సర్కారు కూడా మరో అడుగు ముందుకేసినట్టు తెలుస్తోంది. నిందితుల వెనక ఎవరున్నారనేది ఎంక్వైరీ చేసి.. వారిపైనా చర్యలకు సిద్ధపడినట్టు సమాచారం. నిందితుల వెనకాల ఉన్నది ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వ పెద్దలు పోలీసు శాఖకు చెప్పినట్టు తెలుస్తోంది.
Also Read :