Teenmar Mallanna : చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయిన తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశాడు. కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. తన పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ పార్టీ అని వెల్లడించాడు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయనున్నట్టుగా తెలిపాడు. ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మేడ్చల్ నియోజకవర్గంనుంచి పోటీ చేయనున్నానని మల్లన్న (Teenmar Mallanna) ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రభుత్వంపై నిత్యం తీవ్రమైన ఆరోపణలు చేసే మల్లన్న మంత్రి మల్లారెడ్డిని పలుమార్లు ఘాటుగానే విమర్శించారు. అర్హత లేనివారికి సీఎం కేసీఆర్ కేబినేట్ హోదా ఇచ్చారంటూ పరోక్షంగా కామెంట్స్ చేశారు. అంతేకాకుండా మల్లారెడ్డి అనేక భూకబ్జాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన మల్లన్న మరి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారో చూడాలి.
మల్లన్న జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా ఆయన అభిమానులు, మద్దతుదారులు ఆయనకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. బాణసంచాతో సంబరాలు నిర్వహించారు. తనకు మద్దతు తెలిపిన అభిమానులకు మల్లన్న అభివాదం చేశారు. తీన్మార్ మల్లన్నను మార్చి 21న మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా ఏప్రిల్ 17న మల్కాజ్ గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీన్మార్ మల్లన్నతో పాటుగా మరో ఐదుగురికి కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఒక్కొక్కరి దగ్గర రూ.20వేల ష్యూరిటీని పూచీకత్తుగా తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. మల్లన్నపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో క్రైం నెంబర్ 294, క్రైం నెంబర్ 299 రెండింటిలో మల్లన్నకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. 3 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య మేడిపల్లి పోలీసుల ముందు హాజరుకావాలని షరతు విధించింది.
Also Read :