Teacher Suicide : ఏంటమ్మా.. నువ్ చేసింది..?
Latest Telangana

Teacher Suicide : ఏంటమ్మా.. నువ్ చేసింది..?

Teacher Suicide In nizamabad : (టీచర్లను కించపరచాలనే ఎలాంటి ఉద్దేశం ఇందులో లేదు. ట్రాన్స్ ఫర్ విషయంలో టీచర్ ఆత్మహత్య చేసుకుందన్న వార్త విని బాధతో రాసింది మాత్రమే.. అర్థం చేసుకుని మిగతా టీచర్లకు షేర్ చేస్తారని.. భావిస్తూ…)

………………………………

వేరే ఊరికి ట్రాన్స్ ఫర్ చేశారని నిజామాబాద్ లో ఓ ప్రభుత్వ టీచర్ ఆత్మహత్మ… నిన్న సాయంత్రం నుంచి కొన్ని టీవీ ఛానళ్లలో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది.

..

వార్త చూశాక చాలా బాధ అనిపించింది. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరినైనా బాధించే విషయమే. కానీ ఆమె ఒక టీచర్, అందులోనూ ప్రభుత్వ టీచర్.. ఆత్మహత్య చేసుకోవడం ఏంటీ.?

టీచర్ అంటే పది మంది విద్యార్థులకు మంచిని బోధించాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. ఎంతటి సమస్యనైనా ఎదురించేలా విద్యార్థులను తీర్చిదిద్ది.. ఉన్నతశిఖరాలకు తీసుకెళ్లాలి.

కానీ  జస్ట్ ట్రాన్స్ ఫర్ విషయంలో సూసైడ్ అని చూసే సరికి కాస్త నవ్వు కూడా వచ్చింది.

అంటే టీచర్ల ఎంపిక వ్యవస్థలో తప్పుందా..?

ఆ టీచర్ కుటుంబ పరిస్థితులు ఏంటనేది కాస్త పక్కనపెడదాం.

ట్రాన్స్ ఫర్ అంటే ఏ పాకిస్తాన్ కో .. బంగ్లాదేశ్ కో పంపడం లేదు కదా..?

ఆప్గనిస్తాన్ లో అల్ ఖైదాకు  పాఠాలు చెప్పాలి..? చాక్ పీస్, బ్లాక్ బోర్డు వదిలేసి తుపాకులు పట్టుకుని బార్డర్ లో గస్తీ కాయాలని చెప్పలేదు కదా.

జస్ట్ ఓ ఊరి నుంచి మరో ఊరికి ట్రాన్స్ ఫర్ చేశారు. దానికే ప్రాణం తీసుకోవాలా..?

ఉద్యోగం ఊరికే వచ్చిందా..? ఎన్ని కష్టాలు పడి..? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే ఉద్యోగం వచ్చింది..?

ఉద్యోగం రావాలి.. మంచిగా బతకాలి.. పది మందికి ఆదర్శంగా ఉండాలనే కదా టీచర్ అయ్యింది..!

మరి ఎందుకు జస్ట్ ఓ ట్రాన్స్ ఫర్ కోసం ప్రాణాలు తీసుకోవాలా..? అది కూడా ఇంత తక్కువ వయసులో..?

వేరే ఊరికి ట్రాన్స్ ఫర్ అయితే పిల్లల బాగోగులు చూసుకోలేను అనుకున్న దానివి.. ఇప్పుడు నీ ఇద్దరు పిల్లల బాగోగులు ఎవరు చూస్తారనుకున్నావమ్మా..?

నువ్ ప్రాణాలు తీసుకుంటే.. ఆ పిల్లలకు ఎవరు లాల పోయాలి..? ఎవరు గోరుముద్దలు తినిపించాలి. పండగొస్తే బెల్లన్నం చేసి ఎవరు పెట్టాలి..? నిజంగా సోయి ఉండే చేశామా అమ్మ ఈ పని..?

జస్ట్ ఓ ట్రాన్స్ ఫర్ కోసమే ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉంటే…

ఏళ్లుగా పుస్తకాలన్నీ తిరగేసి.. చదివి చదివి కళ్లు కాయలు కాసి.. కళ్లద్దాలు కూడా కొనుక్కోవడానికి డబ్బుల్లేక.. ఓ పూట తిని.. మరో పూట పస్తులుండి.. అమ్మానాన్నల బాధ చూస్తూ.. ఇప్పటికీ ఉద్యోగం రాక.. అల్లాడుతున్న వారు ఏం చేయాలి..?

వాళ్లు కూడా ప్రాణాలు వదిలేయాలా..?

మనం ఇంత పిరికిగా తయారవుతున్నామా..?

మూడు పూటలా తిండి దొరకని వాళ్లు కూడా.. ఓ గ్లాసు మంచినీళ్లు తాగి రేపటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

అలాంటిది ఓ బాధ్యతాయుతమైన టీచర్ ఆత్మహత్య చేసుకోవడం.. అది కూడా వేరే ఊరికి ట్రాన్స్ ఫర్ చేశారనే కారణంతో ప్రాణాలు తీసుకోవడం.. బాధ కంటే కూడా సిగ్గనిపిస్తోంది.

భావిభారతపౌరులను తయారుచేయాల్సిన వాళ్లే ఇలా ఉంటే.. పిల్లల పరిస్థితి ఏంటీ.?

ఇలాంటి ఘటనలతో… యూనిట్ టెస్ట్ లో 25కు 25 మార్కులు రాలేదని.. హాఫ్ ఇయర్లీలో 100కు 100 రాలేదని.. యాన్సువల్ ఎగ్జామ్ లో ఒక్క మార్కు తగ్గిందని విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడాన్ని.. సమర్థించినట్టే కదా.

పదో తరగతిలో, ఇంటర్ లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు చనిపోవడం కరక్టే అని మనం చెప్పినట్టే కదా..

పదో తరగతిలో, ఇంటర్ లో ఫెయిల్ అయినా… జీవితం అనేది గొప్ప వరం.. అనేక అవకాశాలుంటాయి. టాలెంట్ ఉంటే.. అవకాశాలొస్తాయి.. దిగులు పడొద్దని.. రేపటి నుంచి పిల్లలకు ఎలా చెప్పగలం..?

వాళ్లు అడగరా..?

పలానా చోట.. ట్రాన్స్ ఫర్ కోసం టీచర్ ప్రాణాలు తీసుకుందట..! మరి మేం పరీక్షలో ఫెయిలయ్యాం. ప్రాణాలు తీసుకోవడంలో తప్పేముందని..??

ఒక్కసారి ఆలోచించండి..? ఆ చివరి క్షణాల్లోకి వెళ్లేముందు.. అద్భుతమైన వేలాది రోజులు మనముందున్నాయని మర్చిపోకండి..!

Read Also :