Telangana : తెలంగాణ పాపులర్ సీఎం క్యాండిడేట్ రేవంతేనా…?
Latest News Telangana

Telangana : తెలంగాణ పాపులర్ సీఎం క్యాండిడేట్ రేవంతేనా…?

Telangana : తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ మారుతోంది. టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ప్రత్యామ్నాయం కనిపించని దశ నుంచి…. కనుచూపు మేరలోనే బలమైన ప్రత్యర్థులు యుద్ధానికి సిద్ధమై… కత్తులు దువ్వుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కారును ఢీకొట్టే వాళ్లే లేరనే స్థితి పోయి… కారుమబ్బులు కమ్ముకుంటున్న స్థితి ఏర్పడుతోంది. తెలంగాణలో(Telangana) పాపులర్ టాక్ ఏంటంటే…. కేసీఆర్ కాకుండా సీఎం కాగలిగిన బలమైన ప్రతిపక్ష నేత ఎవరున్నారు….? కాబట్టి… గత్యంతరం లేదు… అని. ఇది నిజం కూడా. కానీ కుందేలు, తాబేలు కథ తెలుసు కదా…! ఇప్పుడా కథ తెలంగాణలో కనిపిస్తోంది. పవర్ రేసులో కేసీఆర్ ను దాటి పరిగెత్తే వాళ్లు లేరనే మాట… పాతదైపోయింది. తోటి పోటీ రన్నర్స్ ట్రాక్ పై వేగంగా పరిగెత్తుకుంటూ కేసీఆర్ ను సమీపిస్తున్నారు. ఓటరు ప్రోత్సాహంతో ఓవర్ టేక్ చేస్తే.. కుర్చీలో కూర్చుంటారు.

– ఓ ఇంట్రెస్టింగ్ సర్వే

తెలంగాణ సీఎం పదవీ పరుగు పందెలో గమ్యం చాలా దూరముంది. ప్రత్యర్థులకు పరిగెత్తేంత సమయమూ ఉంది. మరి కేసీఆర్ ను దాటుకుని ముందుకువెళ్లి…. కుర్చీలో కూర్చునేదెవరు…? ఎవరూ లేరనే దశ నుంచి… ఎవరవుతారు….? వీళ్లా….? వాళ్లా…? అనే దశకు వచ్చి ఆగింది… చర్చ. యెస్… ఇప్పుడీ చర్చ తెలంగాణలో జోరుగా నడుస్తోంది. అలాంటి ప్రశ్నలకు సమాధానంగా…. ఓ ఇంట్రెస్టింగ్ సర్వే కనబడుతోంది. ఆ సర్వే ఏం చెబుతోందంటే… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ గెలుస్తుంది. కానీ… ఎన్నికలు ఇప్పుడే లేవు కదా…! సో అదీ విషయం. ఈ గ్యాప్ లో లోపు ఏమైనా జరగొచ్చు. సర్వే వివరాల్లోకి వెళ్తే….!

– పబ్లిక్ పల్స్

తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై “ది గ్రౌండ్ రిపోర్ట్” అనే ప్రముఖ సర్వే సంస్థ జనతా పోల్ నిర్వహించింది. ఈ సర్వే సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్…. ఫలితాల్ని దాదాపు ప్రతిబింబించాయి. అయితే… ఇప్పుడు ఈ సంస్థ తెలంగాణలో సర్వే చేసింది. ఏ పార్టీ బెస్ట్….?, ఏ లీడర్ బెస్ట్..?, ఎవరిని సీఎంగా చూడాలని అనుకుంటున్నారు….? అనేది సర్వేలో ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలకు ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలతో రిపోర్ట్ రిలీజ్ చేశారు. సర్వేలో వెల్లడయిన ఆసక్తికర విషయమేంటంటే…. “అత్యంత పాపులర్ సీఎం క్యాండిడేట్” గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేశారు.

– బెస్ట్ ఆప్షన్ రేవంత్

“ది గ్రౌండ్ రిపోర్ట్ “సర్వేలో అత్యధికంగా 44శాతం మంది ప్రజానీకం రేవంత్ రెడ్డి సరైన సీఎం అభ్యర్థి అని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇక రెండో స్థానంలో సీఎం కేసీఆర్ వైపు మొగ్గు చూపారు. కేసీఆర్ ను 42శాతం మంది సీఎంగా కోరుకుంటున్నారు. మూడో స్థానంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను 6 నుంచి 7శాతం మంది సీఎంగా ఆమోదిస్తున్నారు. ఈ ముగ్గురు కాకుండా ఇతరుల వైపు ఒకశాతం మంది ప్రజలు మొగ్గు చూపారు.

– తగ్గుతున్న కారు స్పీడు

ఇక సీట్ల విషయానికి వస్తే… టీఆర్ఎస్ 59 నుంచి 64 స్థానాలు గెల్చుకుంటుందని సర్వే పేర్కొంది. టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం 6 సీట్లు గెల్చుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్ 35 నుంచి 40సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో స్పష్టమైంది. బీజేపీ 12 నుంచి 14 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని “ది గ్రౌండ్ రిపోర్ట్ ” తెలిపింది. ఇతర పార్టీలు 5 నుంచి 6 సీట్లు గెల్చుకుంటాయని పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండటం, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటం ఇక్కడ ఆసక్తికర అంశం.

సర్వేలో ప్రజల అభిప్రాయం చూస్తుంటే…. టీఆర్ఎస్ క్రమక్రమంగా ప్రజాదరణ కోల్పోతున్నట్టు స్పష్టమవుతోంది. 2018లో టీఆర్ఎస్ గెల్చుకున్న 88 మంది ఎమ్మెల్యేలకు తోడు ఇతర పార్టీల నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలతో కలిపి ప్రస్తుతం టీఆర్ఎస్ కు 107 మంది ఎమ్మెల్యేల బలముంది. కానీ ప్రస్తుతం ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 65 నుంచి 70 స్థానాలు గెలుస్తుందని సర్వే చెబుతోంది. ఈ లెక్కన ప్రస్తుతం టీఆర్ఎస్ తో ఉన్న ఎమ్మెల్యేల్లో 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారనే కదా అర్థం..! టీఆర్ఎస్ ప్రజాదరణను కోల్పోతుండటమే కదా నిదర్శనం…..!

ఇటీవల జరిగిన వరుస ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయింది. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికలు కేవలం పార్టీలకు అతీతంగా వ్యక్తుల మధ్య జరిగినవే అనేది సుస్పష్టం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్ వంటి ప్రత్యేక పరిస్థితులతో బీజేపీ సీట్లు పెంచుకుంది. వరద సాయం టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారింది. కానీ… లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికలో…. టీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తే… కాంగ్రెస్ గెలిచింది.

– కాంగ్రెస్ లో నయా జోష్

నాలుగు నెలల క్రితం వరకు కాంగ్రెస్ స్తబ్ధుగా ఉంది. కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో బలమైన శ్రేణులు ఉన్నా, సంప్రదాయ ఓటు బ్యాంకు పదిలంగా ఉన్నా, సరైన నాయకత్వం కోసం ఎదురు చూశారు. చాలా మంది మనుగడ కోసం ఇతర పార్టీల్లో చేరిపోయారు. అంతేకాకుండా కాంగ్రెస్ బలంగా ఉంటే ఎప్పటికైనా తమకు ముప్పేనని భావించిన కేసీఆర్…. ఆ పార్టీలోని ముఖ్యనేతల్ని చేర్చుకుని, కీలక పదవులు కట్టబెట్టారు. బలమైన నేతలు పార్టీని వీడటం, చాలామంది సీనియర్లు కేసీఆర్ పై దూకుడు ప్రదర్శించకపోవడం వల్ల… ఒకరకంగా కాంగ్రెస్ మెయిన్ రేసులో కనిపించలేదనే చెప్పొచ్చు. కానీ… రేవంత్ రేసులోకి వచ్చి… ఇప్పటిదాకా ఒకలెక్క, ఇప్పుడిక్కో లెక్క అంటూ… శ్రేణుల్లో ఉత్సాహం పెంచుతున్నారు.

రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ప్రజల ఎజెండాను రేవంత్ రెడ్డి జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు తాజా సర్వే వివరాలు ఆ పార్టీకి ఆశాజనంకంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయముంది. ఈ లోపు మరింత పుంజుకుని…. అధికారం చేపట్టడం ఖాయమనే ధీమా హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది.

– ఎజెండానే ప్లస్ పాయింట్

ఇక… బీజేపీ కూడా టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతోంది. కానీ… ఇది సాధ్యం కాకపోవచ్చని ఇటీవల “ది వైర్” అనే ప్రముఖ పత్రిక విశ్లేషణాత్మ కథనంలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. బీజేపీ ఎజెండా విస్తృతమైన జనామోదం పొందేలా లేదని పేర్కొంది. మతపరమైన ఎజెండాతో తెలంగాణ ప్రజానీకాన్ని ఆకట్టుకోలేరని తేల్చిచెప్పింది. కానీ… రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత, గిరిజన దండోరా, నిరుద్యోగ, విద్యార్థి సైరన్ నిర్వహిస్తున్నారు. బహుజన వాదం, సామాజిక తెలంగాణ వంటి అంశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ ఎజెండాతో ప్రజలు ఆకర్షితులవుతున్నారని “ది వైర్” కథనం సారాంశం. ఓ వైపు “ది వైర్” కథనం, మరోవైపు “ది గ్రౌండ్ రిపోర్ట్” చూస్తుంటే… కాంగ్రెస్ లో జోష్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. “ఇప్పుడే ఎందుకయా తొందరా… ఇంకా మస్తు టైముంది… మైదానం చాలా పెద్దగా ఉంది… అప్పుడే రాజకీయాలానయా…? అని తరచుగా అంటుంటారు కదా మన సీఎం కేసీఆర్. అవును… నిజంగానే… గేమ్ టైమ్ చాలా ఉంది. ప్రత్యర్థులు స్కోర్ పెంచుకుంటున్నారు. చూడాలి.. ఏం జరుగుతుందో.

Also Read :

watch Video :