Petrol : ఓ సారి పెట్రోల్ ట్యాంక్ చెక్ చేసుకోండి.. లేకుంటే అంతే..!
Latest Telangana

Petrol : ఓ సారి పెట్రోల్ ట్యాంక్ చెక్ చేసుకోండి.. లేకుంటే అంతే..!

Petrol pump fraud in telangana : వాహనదారులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అసలే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశన్నంటుతున్నాయి. ఆల్రెడీ చిల్లు పడిన మన జేబులకి భారీ బొక్క పెడుతున్నారు కొన్ని పెట్రోల్ బంకుల ఓనర్లు. ఘరాన మోసంతో లక్షలు వెనకేసుకుంటున్నారు.

ఇలా మూడు రాష్ట్రాల్లో వాహనదారులను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారితో ఫ్రెండ్ షిప్ చేసి మోసానికి తెరతీసినట్టు నిందితులు అంగీకరించారు. తెలంగాణ,ఏపీ, కర్నాటకలో ఈ తరహాలో మోసం చేసినట్టు గుర్తించారు. కొన్ని బంకుల్లో పెట్రోల్ కొట్టించినప్పుడు తక్కువగా వస్తోందని కొందరు వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు కేటుగాళ్లను పట్టుకున్నారు.

ఇంతకీ మోసం ఎలా జరుగుతోంది..?

పెట్రోల్ పంపులో చిప్ లు పెట్టి రీడింగ్ ను మేనేజ్ చేస్తున్నాయి ఈ ముఠాలు. అంటే మనం లీటర్ పెట్రోల్ కొట్టిస్తే 50 నుంచి 100 మిల్లీలీటర్లు తక్కువ వస్తుంది. మీటర్ లో మాత్రం లీటర్ అని చూపిస్తుంది. పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే వారికి భారీగా లాస్ జరిగినట్టే. పది లీటర్ల పెట్రోల్ కొట్టిస్తే.. ట్యాంక్ లోకి 9 లీటర్లే వస్తుందన్నమాట. ఇలా వేలాదిమందిని ఈ కేటుగాళ్లు మోసం చేశారు.

జగద్గిరిగుట్టకు చెందిన ఫైజల్‌, సందీప్‌, అస్లం, నర్సింగ్‌ రావు గతంలో పెట్రోల్ బంకుల్లో పనిచేశారు. చిప్ లు పెట్టి ఎలా మోసం చేయాలో వీరికి అప్పటికే అనుభవం ఉంది. దీంతో వీళ్లంతా కలిసి ఓ ముఠాగా తయారయ్యారు.  ఇంకేముంది పెట్రోల్ బంకుల యజమానులతో మిలాఖత్ అయ్యారు. వారితో పర్సంటేజీ మాట్లాడుకున్నారు.

హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల, మేడిపల్లి, జవహార్ నగర్, మైలార్ దేవ్ పల్లి, అటు.. ఖమ్మం, మహబూబ్ నగర్, నెల్లూరు, వనపర్తి, సూర్యాపేట, సిద్దిపేటలోని కొన్ని బంకుల్లో చిప్ లు పెట్టి కస్టమర్లను నిలువునా ముంచారు.

వచ్చిన డబ్బులను వాటాలేసుకున్నారు.

తరుచుగా పెట్రోల్ తక్కువగా వస్తుండటంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తూనికలు కొలతల శాఖ వారితో కలిసి సోదాలు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ కేసులో పెట్రోల్ బంకు ఓనర్లైన రమేష్, వెంకటేష్, మహేశ్వర్ రావు, వంశీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.