Telangana bjp : బై.. బై.. బండి…! బై.. బై ఈటల..! బై.. బై.. వివేక్..?
Latest Telangana

Telangana bjp : బై.. బై.. బండి…! బై.. బై ఈటల..! బై.. బై.. వివేక్..?

Interesting situations in telangana bjp : తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఒక రకమైన విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. కొత్త అధ్యక్షుడు వస్తాడని కొందరు.. ఆ ప్రసక్తే లేదని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం(ఇవాళ, రేపు) బీజేపీ జాతీయ కార్యవర్యసమావేశాలు జరుగుతున్నాయి. వీటి తర్వాత రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. నాలుగురోజుల కిందట స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీ వెళ్లొచ్చింది కూడా అందుకేననే టాక్ కూడా ఉంది.

ఒకే రోజులో సంజయ్ ఢిల్లీ వెళ్లి రావడంతో అక్కడ ఏదో జరిగిందనే ప్రచారం గుప్పుమంది. అధిష్టానం సంజయ్ కి టాటా చెప్పినట్టేనని ఆ పార్టీలోని ఓ వర్గం ప్రచారం మొదలుపెట్టింది. కానీ అంతా ఉత్తదేనని సంజయ్ వర్గం చెప్పుకొచ్చింది. తమ నాయకుడే పార్టీ రాష్ట్ర బాధ్యతల్లో కొనసాగుతారని చెప్పుకొస్తోంది.

Read Also :

ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నట్టు సమాచారం. చాలా రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. దీంతో ఆయా రాష్ట్రలకు చెందిన నాయకులను కేబినెట్ లోకి తీసుకునేందుకు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.

తెలంగాణపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఇక్కడ మరొకరికి కేంద్రమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే.. ఆ పదవి కోసమే ముగ్గురు ఎంపీలు పోటీ పడుతున్నారని టాక్. తనకు కేంద్ర కేబినెట్ లో పోర్ట్ ఫోలియో కావాలని గట్టిగానే అడుగుతున్నాడట. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి అలాగే ఉంచి కేబినెట్ లోకి తీసుకోవాలని అడుగుతున్నట్టు సమాచారం.

దీనికోసమే ఆయన ఈ మధ్య ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల దగ్గర లాబీయింగ్ చేసి వచ్చినట్టు సమాచారం. తెలంగాణలో పార్టీకి కాస్తో కూస్తో ఓట్లు పడుతున్నాయంటే అది తనవల్లేనని.. తనకు కేంద్రమంత్రి పదవి ఇస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు మరింత పెరుగుతుందని పెద్దలకు వివరించినట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని బండి వర్గంలో టాక్.

అసలు సమస్య ఇక్కడే వచ్చిందని కమలం వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. గతంలో రాష్ట్రంలో బీజేపీ కాస్త ఐక్యంగానే ఉండేది. కొత్త వాళ్లు రావడంతో అక్కడకూడా గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి పాత నేతలే కాదు.. ఈటల రాజేందర్, వివేక్, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి కొత్త నేతలు కూడా ఎవరికి వారు తమ గ్రూపులను నడిపిస్తున్నారని టాక్ ఉంది.

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి.? కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఢిల్లీ బీజేపీ మల్లగుల్లాలు పడుతోందట. ఉద్యమకారుడిగా పేరున్న ఈటలకు రాష్ట్ర బాధ్యతలు ఇస్తారనే ప్రచారం చాలాకాలంగా వినిపిస్తోంది.

కానీ అదే జరిగితే.. బీజేపీకి ప్రధాన మీడియాగా ఉన్న వీ6 ఓనరైన వివేక్ ఎంత వరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈటలను బీజేపీలోకి తీసుకొచ్చిందే వివేక్. కానీ  ఆ తర్వాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. వీ6లో ఈటలపై దాదాపుగా నిషేధం కొనసాగుతోందట.

ఇలాంటి పరిస్థితుల్లో పదవుల విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో మోడీషా, బీఎల్ సంతోష్ ఉన్నారట. ఏ మాత్రం తేడా జరిగినా.. పార్టీకి ప్రస్తుతం చాలా ఉపయోగకరంగా ఉన్నవాళ్లు బిస్తర్ సర్దుకునే ప్రమాదం ఉందని… ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే దానిపై ఒకటికి పదిసార్లు చర్చలు జరుపుతున్నారట.

వివేక్ తన మీడియా మొత్తాన్ని బీజేపీని నిలబెట్టేందుకు వాడుతున్నారనే విమర్శలున్నాయి. ఎన్నికల కోసం తన ఆర్థిక వనరులను ధారపోస్తున్నారనే టాక్ ఉంది. ఇన్ని చేసినా ఆయనకు కేవలం జాతీయ కార్యవర్గసభ్యుడనే హోదా మాత్రమే ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పార్టీ బాధ్యతలు ఇవ్వాలని అడుగుతున్నారట.

అటు.. ఈటలకు పదవి ఇవ్వకుంటే ఆయన, ఆయనతో పాటు.. వచ్చిన వాళ్లు జెండా ఎత్తేసే ప్రమాదముంది. అయితే.. పాత లీడర్లు RSS నేపథ్యం ఉన్నవాళ్లు కాబట్టి పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా సిద్ధాంతం కోసం పనిచేస్తారు. కానీ కొత్త లీడర్లంతా గత పార్టీలో పదవులు రాకపోవడం వల్లో.. మరో కారణం చేతనో.. కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో కమలం పెద్దలకు అర్థం కాక తలపట్టుకుంటున్నారట.

Read Also :