GV Ramakrishna rao :నియ్యతి గళ్ల మనిషికే పట్టం..
Latest Telangana

GV Ramakrishna rao :నియ్యతి గళ్ల మనిషికే పట్టం..

GV Ramakrishna rao  Karimnagar TRS president  :‘నేనున్న, మీకేం గాదు… ధైర్నం సెడకుర్రి, మీకేం గావాలన్నా, మీకేం పని గావాలన్నా… నా దగ్గరికి రార్ర’ని పిలిసే మంచి మనిషి, బంగారమసొంటి మనస్తత్వం గల ప్రజల మనిషి జీవీ రామకృష్ణారావు (జీవీఆర్‌). టీఆర్‌ఎస్‌ కార్యకర్త స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడి దాకా ఎదిగిన ఆయనకు ముందుగాళ్ల శుభాకాంక్షలు. దొరల ఖాన్‌దాన్‌… లంకంత కొంప… తరాలు తిన్నా ఒడువని ఆస్తులు. ఇవేం శాశ్వతం గాదు, ‘మా తెలంగాణ మాగ్గావాలె’ అని ముందుండి నడిసిన వ్యక్తి. తెలంగాణొస్తే మన బతుకులు బాగుపడ్తయని భావించిండు. ఆయన కొరుకున్నట్టే తెలంగాణొచ్చింది.

‘టీఆర్‌ఎస్‌’ అంటే జీవీ, జీవీ అంటే ‘టీఆర్‌ఎస్‌’… కన్నారం జిల్లా మానకొండూర్ల వుట్టిన నాది 2001ల తొమ్మిదో తరగతి అయిపోయింది. కరెస్టు పధ్నాలుగేండ్లున్న గావొచ్చు. ఎండకాలం సెలవుల్ని మంచిగ ఎంజాయ్‌ జేస్తున్న. ఓ రోజు ఐస్క్రీం బండి ముందటుర్కుతున్నది, ‘ఐస్క్రీం బండి ఆగు, ఐస్క్రీం బండి ఆగు’ అంటూ దానెంబడి నేనుర్కుతున్న. ఇంతల జీవీ వాళ్లింటిముందు ఆగున్న జీబు కంట్లె వడ్డది. ఆ జీబు ‘గులాబీ’ రంగు జెండాలతో తళతళా మెరుస్తున్నది. అగ్గొ… గిదేందిరబై, మూడురంగల జెండాను జూసిన, పచ్చజెండాను జూసిన. గిప్పుడు గీ కొత్త ‘గులాబీ’జెండా కనవడుతుందని ఒక్కసారి పరేషాన్‌ అయిన.

అరువై ఏండ్ల ఆంధ్రోళ్ల వలస దోపిడీ పాలనను ఎండగట్టి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకునేటందుకు కొత్త రాజకీయ వస్తున్నదని, దానికోసమే జీవీతో చర్చలు వెట్టేందుకు పార్టీల ఉన్న పెద్ద పెద్ద తలికాయలు ఆయన దగ్గరికి వచ్చినయని, ఆ పార్టీ పేరు ‘టీఆర్‌ఎస్‌’ అని, దానికి నాయకుడు ‘కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌)’ అని ఆ తర్వాత తెలిసింది. న్యాయ విద్యను సదువుకున్న జీవీఆర్‌కు తెలంగాణకు జరిగిన అన్యాలమంత తెలుసు. ఒగసారి ఊరి ప్రజలను ఏకం జేసిండు. మానకొండూర్‌ గడిల మీటింగ్‌ వెట్టిండు. ఆ మీటింగుకు మా మానకొండూరు ప్రజలే గాదు, సుట్టూ ఉన్న పల్లెటూర్ల నుంచి గూడ ప్రజలు పట్టం గట్టిర్రు. ‘నీళ్లు, నిధులు, నియామకాల’ విషయంల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ మీటింగుల కళ్లకు కట్టిండు జీవీ. మనకు న్యాయం జరుగాల్నంటే కచ్చితంగా మనం టీఆర్‌ఎస్‌ ఎంబడి నడువాల్నని చెప్పిండు. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకొస్తయి, మనమే కాదు, మన తెలంగాణ బిడ్డలంతా బాగుపడుతరని చెప్పంగనే ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ అంటూ..’ గట్టిగ నినదించిర్రు సభల కూసున్నోళ్లంత. జీవి మాటలు అక్కడున్నోళ్లందర్నీ ఆలోచింపజేసినయి. ఆయన మాటలింటున్న నాగ్గూడా ఒక్కసారి రొమాళ్లు నిక్కవొడ్సినయి. . మీటింగు నుంచి ఇంటి రాంగనే మా రేకులింటి మీద రెపరెపలాడుతున్న పచ్చ జెండాను పీకి మోర్లె వారేసిన.

‘ఔరా… జీవీ సార్‌ చెప్పిన మాట నిజమేనా, తెలంగాణస్తే పంటలు పండుతాయిరా, మన బీడు భూమి పచ్చగా కళకళలాడుతుందా, నీకు నౌఖరస్తదా, అవ్వకు పింఛన్‌ అస్తదా..?’ ‘ఔనమ్మా… తెలంగాణ వస్తే మన బతుకులు మంచిగయితయటనే, కచ్చితంగా మనం సారు జెప్పిన టీఆర్‌ఎస్‌ ఎంబడి నడువాలె, నీ అవ్వ నేన్గూడ జీవీ సార్‌ చెప్పినట్టే నడుస్తా… (అప్పటికీ నాకు ఓటు హక్కు రాలే) ‘చల్‌ గంతే పోరా’, ‘ఈ పచ్చ పార్టోన్ని, ఆ ఆంధ్రోన్ని ఎన్ని రోజులని నమ్ముతం. వానికోటేస్తే ఒరిగిందేముంది..? ఇప్పటికి తొమ్మిదేండ్లాయే ఎట్లున్న భూమి అట్లనే పడావున్నది. కరెంటు లేక ఆ తీగలమీన్నే నీ అంగీలు, లాగులెండేస్తున్న. కరంటు లేక బాయి మోటర్లు మునుగుతున్నయ్‌. ఇగ గా జవ్వాజొళ్ల తాతలకైతే తిందాం అంటే తీరిక దొరుకతలేదు (జవ్వాజొళ్ల తాతలంటే మా ఊళ్లె నీళ్లల్ల మునిగి కరాబైన బాయి మోటార్లు మంచిగ జేస్తరు). జీవీ సార్‌ వాళ్లింట్ల (గడిల) టీఆర్‌ఎస్‌ తొలి మీటింగ్‌ వెట్టిన రోజు రాత్రి నాకు, మా అమ్మకు జరిగిన ముచ్చటిది. పచ్చ పార్టీకి ఖంచుకోట అయిన మా మానకొండూర్‌ తెల్లారేసరికి గులాబీ రంగయింది. ప్రతి గుడిసెకు గులాబీ జెండా నీడనిచ్చింది. ఊరు ఊరంతా ఏకమై జీవీసార్‌ ఎంబడి నడిసింది.

ఈ ఇరువై ఏండ్ల టీఆర్‌ఎస్‌ చరిత్రల టీఆర్‌ఎస్‌ పార్టీ కోసం జీవీ సార్‌ చేసిన సేవలు ఎలకట్టలేనివి. ఉద్యమకాలంల తాతల నుంచి వచ్చిన సొంత ఆస్తులు కూడా ఎండకు వెట్టిన ఐస్‌ గడ్డోలె కరిగిపోయినయ్‌. కానీ ఎక్కడ గూడ జీవీ వెనుకడుగు వేయలె. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ అన్నా… ఆ పార్టీ జెండా అన్నా.. ఆ పార్టీ నాయకుడి ఎజెండా అన్నా.. జీవీకి ఉన్న ఆపారమైన ప్రేమనే కారణం. అన్నింటికి మించి తెలంగాణపై ఉన్న అభిమానం, తెలంగాణకు జరిగిన అన్యాయం జీవీని ముందుకు నడిపించింది. ఏ ధర్నా జరిగినా… ఏ బందు జరిగినా.. ఏ రాస్తారోకో జరిగినా.. ఇట్లా తెలంగాణ కోసం తెగించిన కొట్లాడిన ప్రతి యువకునికి అన్నం పెట్టి పంపిండు జీవీఆర్‌. వాళ్లిల్లు (గడి) ఇప్పటికీ నిత్యాన్న సత్రమే..

రెండున్నరేండ్ల కింది ముచ్చట ఇది… ‘ఔరా సత్తీ… జీవీ సారొళ్లింటికి ఎప్పటికెవ్వలో అస్తనే ఉంటరు, పోతనే ఉంటరు కానీ మన సారుకు మాత్రం ఏ పదవీ అస్తలేదేందిరా..?’ ఇంటికి వోయినప్పుడు అమ్మడిగింది. ‘అమ్మా… మన సారు లెక్కనే, కేసీఆర్‌ గూడ నియ్యత్‌ గల్ల మనిషేనే. తెలంగాణ కోసం ఉద్యమించినోళ్లను, పార్టీ కోసం కట్టవడ్డోళ్లను ఎన్నడోనాడు కచ్చితంగా గుర్తిస్తడు. సో జీవీ సారు రాల్సిన సెమ్ట సుక్కల కట్టం ఉత్తగేం బోదు, ఎన్నడోనాడు ఆయనగ్గూడ న్యాయం జర్గుతది’ అన్జెప్పిన. నా ముచ్చటిన్న అమ్మ గూడ మస్తు సంబురవడ్డది.

ఇట్లా ఆమె ఒక్కతే కాదు, మానకొండూరుకు వోయినప్పుడల్లా ప్రతి మనిషి నోటివెంట వినపడే ముచ్చట ఇదే. కన్నారం వోయినప్పుడు కనవడ్డ మనిషి నోటెంట ఇదేమాట… మా ఊరోళ్లు, మా కన్నారమొల్లు కోరుకున్నట్టే.. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం జీవీఆర్‌కు రెండేండ్ల కిందటనే ‘సుడా’ చైర్మన్‌ పదవిచ్చిండు. ఆయన నియ్యతిగా పన్జేస్తున్న కావట్టే ఇప్పుడు మళ్లా ‘టీఆర్‌ఎస్‌’ జిల్లా అధ్యక్షుడిగా జీవీని ఎన్నికజేసింది. నియ్యతిగా, పార్టీ కోసం పన్జేసే కార్యకర్తకు పార్టీల ఏదో ఒక్క రోజు తప్పకుండా న్యాయం జరుగుతదని జీవీ సారు ఎన్నికే ఉదాహరణ. జీవీ సార్‌ సారథ్యంల మా కన్నారం జిల్లాల ‘టీఆర్‌ఎస్‌’ పార్టీ మరింతా విజయవంతంగా సాగుతుందని, అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జీవీఆర్‌కు శుభాకాంక్షలు.

– గడ్డం సతీష్‌, 99590 59041