దేశ సేవలో ఇరవయ్యేళ్లు… సొంత ఊరిలో ఘన స్వాగతం
Latest Telangana

దేశ సేవలో ఇరవయ్యేళ్లు… సొంత ఊరిలో ఘన స్వాగతం

ఒకటి కాదు, రెండు కాదు. ఇరవై సంవత్సరాల పాటు దేశ సేవలో తరించాడు. ప్రేమను పంచే కుటుంబానికి… ఆప్యాయతను పంచే స్నేహితులకు దూరంగా ఇరవయేళ్లు గడిపాడు. భారత రక్షణ దళం ఎయిర్ ఫోర్స్‌లో ఇరవై సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించి ఇటీవలే పదవీ విరమణ పొందాడు. ఈ సందర్భంగా సొంత ఊరుకు వచ్చిన క్రమంలో మిత్రబృందం ఘనంగా స్వాగతం పలికారు.

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వేదవ్యాస్‌కు చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువ. ఆ క్రమంలో ఇరవై సంవత్సరాల కిందట ఎయిర్‌ఫోర్స్‌లో చేరి దేశ రక్షణలో తన వంతు సేవలు అందించాడు. వేదవ్యాస్ అన్న గారి మిత్రుడు సురేశ్ అదివరకే నేవీలో చేరి సేవలందిస్తున్నారు. ఆ క్రమంలో అతడి సలహాలు, సూచనలు తీసుకుని గుంటూరులోని ఓ శిక్షణాకేంద్రంలో కోచింగ్ తీసుకుని మొదటి అటెంప్ట్‌లోనే ఎయిర్‌ఫోర్స్‌లో సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు అతడి వయసు 19 సంవత్సరాలు. అలా వైమానికదళంలో చేరి దేశరక్షణలో పాలు పంచుకున్నాడు. వివిధ హోదాల్లో పనిచేసి ఆఫీసర్‌గా ఇటీవల రిటైర్ అయ్యాడు.

దేశ రక్షణలో తన వంతు పాత్ర సమర్థవంతంగా పోషించి… పదవీ విరమణ తీసుకుని తన సొంత ఊరుకు వచ్చిన క్రమంలో వేదవ్యాస్‌కు మిత్రబృందం ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించి స్థానిక కృష్ణా మందిర్ నుంచి తన ఇంటి వరకు జీపులో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మార్గమధ్యంలో కార్గిల్ చౌరస్తా దగ్గర అమర జవానులకు నివాళులు అర్పించారు. ఇంటి దగ్గర వేదవ్యాస్‌ను బంధువులు సత్కరించారు. ఈ సందర్భంగా వేదవ్యాస్ మాట్లాడుతూ… మన దేశంలో ఎంతోమంది జనాభా ఉన్నప్పటికీ భరతమాతకు సేవ చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టమన్నారు. సైన్యంలో చేరడానికి తనకు మనోధైర్యం కల్పించిన తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. దేశ రక్షణలో భాగంగా తనకు ఏ పని అప్పజెప్పినా సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల మెప్పు పొంది… ఒక సైనికుడిగా పదవీ విరమణ పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.