EATALA RAJENDER :బీజేపీ బీ-ఫామ్ పై… ఇండిపెండెంట్ గా గెల్చిన ఈటల
Latest Telangana

EATALA RAJENDER :బీజేపీ బీ-ఫామ్ పై… ఇండిపెండెంట్ గా గెల్చిన ఈటల

Eatala rajender won his strength : “ఏ ఇంటి కోడి అయితేంది.. మా ఇంట్ల గుడ్డు వెట్టింది” అని సంబరపడిపోతున్నరు బీజేపీ లీడర్లు. హుజురాబాద్ లో జరిగిన ఉత్కంఠ ఉపఎన్నికలో మాజీమంత్రి, మాజీ టీఆర్ఎస్ లీడర్ ఈటల రాజేందర్ విజయాన్ని చాకచక్యంగా తన ఖాతాల వేసుకుంటున్నరు. ఎన్నికలో ఎవరు గెలుస్తారనే చర్చకు తెరపడటంతో ఇప్పుడు… ఇది ఎవరి గెలుపు, ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అనే చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల నుంచి, నెటిజన్ల వరకు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఎన్నిక ప్రజాభిప్రాయంపై కొంత ప్రభావం చూపుతుంది. కానీ… ఇప్పుడు హుజురాబాద్ గెలుపు… అందుకు భిన్నమైందిగా కనిపిస్తోంది. కేవలం హుజురాబాద్ ప్రజల తీర్పే… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మూడ్ అని చెప్పలేం. ఎందుకంటే హుజురాబాద్ లో ఎన్నిక జరిగింది… కేవలం కేసీఆర్, ఈటల మధ్య అనేది అందరికీ తెలిసిందే.

మంత్రివర్గం నుంచి బర్తరఫ్, భూకబ్జా ఆరోపణలతో ఘోర పరాభవంతో టీఆర్ఎస్ కు దూరమైన ఈటల రాజేందర్(EATALA RAJENDER)… భవిష్యత్ అడుగులపై ఆసక్తి ఏర్పడింది. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కాంగ్రెస్ లీడర్లతో ఈటల సమావేశం కావడంతో ఆ పార్టీలోకి వెళ్తారని అంతా భావించారు. కానీ బీజేపీ లీడర్లు పట్టుబట్టి ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకున్నరు. ఈటల కూడా ఆలోచించాడు. రాష్ట్ర ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తోంది కాబట్టి… కేంద్రం సపోర్ట్ ఉంటుందనే ఆలోచనతో కమలం పార్టీలో చేరాడు. ఈటల తీసుకున్న నిర్ణయం ఓ దశలో తన పట్ల కొందరిలో వ్యతిరేకతగా మారింది. ఈటల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుస్తాడు… అనవసరంగా బీజేపీలో చేరాడనే అభిప్రాయం వ్యక్తమైంది. కేసీఆర్ అంటే వ్యతిరేకత ఉన్నవాళ్లు, ఈటలను వ్యక్తిగతంగా సపోర్ట్ చేసేవాళ్లు… బీజేపీ అంటే పడనివాళ్లు…. ఈటల నిర్ణయాన్ని సమర్థించలేదు. పైగా రాజేందర్ రాజకీయ, భావజాల నేపథ్యం, ఉద్యమ సంస్థలతో సంబంధాల దృష్ట్యా ఈటల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ కేసీఆర్ పెట్టిన కేసుల కారణంగా ఈటలకు బీజేపీ సురక్షిత స్థావరమైంది.

ఇప్పటికే ఒకే నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచి ఉండటం, ప్రతీ గ్రామంలో ప్రజా సంబంధాలు, అనుచరులు, టీఆర్ఎస్ వైఖరి పట్ల ప్రజల్లో అసంతృప్తి ఈటలకు కలిసి వచ్చింది. నిరుద్యోగ యువత బాసటగా నిలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి బయటకు పంపిన తీరుతో ఈటలకు సానుభూతి పెరిగింది. కేసీఆర్ అవమానకరంగా వ్యవహరించారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. ఇదే విషయాన్ని ఈటల ఎజెండాగా తీసుకుని ఆత్మగౌరవ నినాదాన్ని ప్రచారాస్త్రాంగా మలచుకున్నారు. ఉద్యమకారుడికి కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈటల భార్య జమున ఐదు నెలలుగా పర్యటించని గ్రామం లేదు. పలకరించని ఓటరు లేరు అన్నట్టుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈటల రాజీనామా చేసి తొలిసారి కమలాపూర్ వెళ్లినప్పుడే ఎన్నికల ప్రచారం మొదలైందని చెప్పుకోవచ్చు. అప్పటికి ఏ పార్టీలో చేరకపోయినా పెద్దఎత్తున జనం కదలివచ్చారు. ఈటల రాజేందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుస్తారనే చర్చ జరిగింది. బీజేపీలో చేరిన తర్వాత ప్రజా ఆశీర్వద యాత్ర నిర్వహించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మీ కళ్ల ముందుకు ఎదిగిన బిడ్డకు అన్యాయం జరిగింది… అండగా నిలవండి అంటూ ప్రజల్ని వేడుకున్నారు.

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరినట్టే కానీ… ఎక్కడా ఆ పార్టీ కార్డు వాడలేదు. ఎన్నికల ప్రచార సరళిలో ఈ ధోరణి మనం గమనించవచ్చు. కమలం పార్టీ సంప్రదాయ నినాదాలైన జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై, హిందుత్వ ఎజెండా ఎక్కడా ప్రస్తావించలేదు. మైనారిటీల సమ్మేళనం పెట్టి మద్దతు కోరారు. సాధారణంగా బీజేపీ నేతలు ముస్లిం టోపీ పెట్టుకోవడానికి విముఖత వ్యక్తం చేస్తారు. కానీ ఈటల ఓ సమావేశంలో ముస్లిం టోపీ పెట్టుకున్నారు. తాను కేవలం సాంకేతికంగా బీజేపీలో ఉన్నప్పటికీ… అందరి మద్దతు తనకు అవసరమని, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాలని కోరారు. ఒక విధంగా చెప్పాలంటే ఈటలపై వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ కారణంగా, ప్రత్యేకత సంతరించుకున్న ఈ ఎన్నికల్లో ఈటలకు ఓటేద్దాం అని వివిధ పార్టీల నేతలు, సానుభూతిపరులు, సాధారణ ప్రజలు అనుకున్నారు. అంతేతప్ప… బీజేపీకి క్యాడర్ ఎక్కడుంది…? ఓటర్లెక్కడున్నరు….?

హుజురాబాద్ ఎన్నిక దేశంలోనే మునుపెన్నడూ జరగని తరహా ఎన్నిక. కేవలం కేసీఆర్ పై తిరుగుబాటు చేసిన కారణంగా ఈటలను ఎట్లనైనా ఓడించాలని కేసీఆర్ పంథం పట్టాడు. వివిధ ప్రభుత్వ పథకాల కింద వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. బలం, బలగం మోహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలోనే తిష్టవేశారు. టీఆర్ఎస్ చేస్తున్న ఓవరాక్షన్ మొత్తం…. ఈటలను ఓడించడం కోసం పడుతున్న ప్రయాసగా ప్రజలకు అర్థమైంది. కేసీఆర్, హరీశ్, మంత్రులు, ఇతర నేతలు అతిగా కష్టపడ్డప్పుడే చాలా మందికి అర్థమైంది. కేసీఆర్ గెలవడం అంత ఈజీ కాదని. అదే జరిగింది. ఈటల భారీ మెజిరిటీతో విజయం సాధించారు. అత్మగౌరవ బావుటా ఎగురవేశారు.

ఇప్పుడు మరో చర్చ. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉంటుంది….? కేసీఆర్ ను ఎదిరించి బయటకు వస్తే… దయనీయ పరిస్థితి ఏమీ ఉండదు. కేసీఆర్ ఏమీ ఓటమికి అతీతుడు కాదు. తల్చుకుంటే కేసీఆర్ ను ఓడించడం అంత కష్టమేమీ కాదు. అనే స్పష్టమైన సంకేతమైతే తెలంగాణ జనం గుర్తించారు. కానీ… ఈ గెలుపు ఏ పార్టీకి లాభమంటే చెప్పడం కష్టం. ఎందుకంటే… ఇప్పుడు జరిగిన ఎన్నికలు పార్టీల మధ్య జరగలేదు. కేవలం కేసీఆర్, ఈటల మధ్యనే జరిగాయి. ఈటల(EATALA RAJENDER) గెల్చిన తర్వాత కూడా ఇదే విషయం చెప్పారు. కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు విజయం సాధించారని తేల్చిచెప్పారు. కళ్ల ముందు ఇన్నాళ్లు ఉన్న బిడ్డను గెలిపించుకోవాలని ప్రజలు భావించారని, బీజేపీ నేతలు తన వెన్నంటి ఉంటూ విజయంలో భాగం పంచుకున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కారు గుర్తు వల్లే గెలిచానంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శించారని, ఇప్పుడు అర్థమైందా ఎవరు… ఎవరి గుర్తుపై గెలిచారో అంటూ గులాబీ బాస్ కు కౌంటర్ ఇచ్చారు. ఇండైర్ట్ గా అప్పుడైనా… ఇప్పుడైనా సొంత పరపతితోనే గెల్చినట్టు స్పష్టంచేశారు. ఇది నిన్నటి ఈటల మాట. ఇవాళ బీజేపీ నేతలు మాత్రం…. ప్రజలు బీజేపీనే గెలిపించారని అన్నారు. ఉఫ్… సరే ఊకో ఊకో… అంటున్నరట జనం. ఎవరెన్ని చెప్పినా… ఇది కేసీఆర్, ఈటల మధ్య జరిగిన ఆధిపత్య పోరు. ఇందులో కేసీఆర్ అహంకారం ముందు, ఈటలపై వచ్చిన అవినీతి ఆరోపణలు పెద్దగా నిర్ణయాత్మక అంశాలు కాలేదు… అంతే.

Read Also :