BRS గా మారిన టీఆర్ఎస్ లో త్వరలో కీలక మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో హ్యాట్రిక్ పక్కా అనే గట్టి నమ్మకంతో ముందుకెళ్తున్న భారత్ రాష్ట్ర సమితి(BRS).. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కు BRS రాష్ట్ర పగ్గాలు అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉందని టీఆర్ఎస్ వర్గాల సమాచారం.
జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను ప్రకటించారు. అప్పుడు పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు అవుతారు. కాబట్టి రాష్ట్ర పార్టీకి కూడా ఓ అధ్యక్షుడు ఉండాలి. కానీ ఇప్పటి వరకు నియామకం జరగలేదు. త్వరలోనే రాష్ట్ర పార్టీకి ఓ అధ్యక్షుడిని నియమించాలని కేసీఆర్ నిర్ణయించారట. సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. అయితే.. పార్టీలో ఉన్న చాలామంది కీలక నాయకులను కాదని బండ ప్రకాష్ కే BRS రాష్ట్ర అధ్యక్ష పదవి ఎందుకు ఇస్తున్నారనేది ఆసక్తి కరంగా మారింది. దీని వెనకాల పెద్ద ప్లాన్ ఉందని తెలుస్తోంది.
బండ ప్రకాశ్… ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు. రాష్ట్రంలో ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య కూడా ప్రభావవంతమైన స్థాయిలో ఉంది. దీంతో వారిని ఆకర్షించేందుకే ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం. అలాగే.. కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్ కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారే. ఆయన కమలం గూటికి చేరిన నాటి నుంచి ముదిరాజ్ సామాజిక వర్గ ఓటర్లను బీజేపీవైపు తిప్పడంపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా వారిని ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగానే స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా పలుమార్లు వారిని కలిసి మాట్లాడారు.
దీంతో.. ఇప్పుడు ముదిరాజ్ లను కారువైపు లాగాలంటే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఉన్నత పదవి ఇవ్వాలనే ఉద్దేశంలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. మొత్తంగా బీసీలకు పెద్దపీట వేశామనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బండ ప్రకాష్ నియామకం ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో ఇది బీజేపీ ప్రయత్నాలకు చెక్ పెడుతుందని.. ఖచ్చితంగా పార్టీకి లాభిస్తుందని వారు భావిస్తున్నారని సమాచారం.
Also Read :