Bjp Trishula vyuha : మునుగోడులో త్రిశూల వ్యూహం.. ఎవరిపై.?
Latest Telangana

Bjp Trishula vyuha : మునుగోడులో త్రిశూల వ్యూహం.. ఎవరిపై.?

Bjp Trishula vyuha In munugodu : రాష్ట్రంలో మునుగోడు బైపోల్ రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జరుగుతున్న బైపోల్ కావడంతో.. దీన్ని అన్ని పార్టీలు ప్రీ ఫైనల్ గానే భావిస్తున్నాయి. గెలుపుకోసం శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.

వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ కు, కమ్యూనిస్టులకు కంచుకోట. టీఆర్ఎస్ కంటే ముందు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఈ రెండు పార్టీల వాళ్లే ఉంటారు. 2014లో అనూహ్యంగా టీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాతి ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయంతో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగిరింది.

ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. అయినా మునుగోడులో తమ కేడర్ బలంగా ఉందని కాంగ్రెస్ చెబుతోంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు తమదేనని అంటోంది. అందులో భాగంగానే పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చామని అంటోంది.

కానీ.. బీజేపీ మాత్రం తమదే గెలుపని అంటోంది. బీజేపీ ఈ మాట చెప్పుకోవడంతో ఆగిపోలేదు. దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో కీలకమైనది “త్రిశూల వ్యూహం”.

Read Also:

బాహుబలి సినిమా క్లైమాక్స్ లో కాలకేయ సైన్యాన్ని దెబ్బతిసేందుకు త్రిశూలవ్యూహాన్ని అమలుచేస్తారు. ఇప్పుడు బీజేపీ (Bjp Trishula vyuha) కూడా మునుగోడులో గెలుపు కోసం ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందనే ప్రచారం అటు బీజేపీలో.. ఇటు కాంగ్రెస్ లోనూ వినిపిస్తోంది.

మునుగోడు కాంగ్రెస్ కు కంచుకోట కాబట్టి అక్కడ బీజేపీ గెలవాలంటే.. కాంగ్రెస్ ను దెబ్బతీయాలి. కాంగ్రెస్ ను ఎంత బలహీనం చేస్తే బీజేపీకి అంత లాభం అనేది కమలనాథుల ప్లాన్ గా తెలుస్తోంది. దీనికోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ని వాడుతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలియని వాళ్లుండరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇద్దరు అన్నదమ్ములే  కాదు. వ్యాపారభాగస్వాములు కూడా. అయితే.. రాజగోపాల్ రెడ్డి  చాలా కాలం అసంతృప్తితో ఉండి చివరకు బీజేపీ కండువా కప్పుకున్నాడు. వెంకటరెడ్డి కూడా వెళ్లిపోతారనే ప్రచారం ఓ దశలో జరిగింది.

కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోనే ఉంటానని చెబుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. పైగా మునుగోడు ఇష్యూలో పార్టీ లీడర్లపై అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్ అయిపోయింది. ఓ వైపు పార్టీలో ఉన్నానంటూనే.. ప్రజల్లో పార్టీపై అనుమానాలు కలిగేలా వెంకటరెడ్డి మాటలు, చేతలు ఉన్నాయని హస్తం నేతలంటున్నారు. పార్టీని వీడేది లేదని చెబుతున్నా.. ఆయన త్వరలోనే పోతారని ఆ పార్టీ వాళ్లే అంటున్నారు.

అయితే.. వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాట్లాడే ప్రతీమాట, చేసే ప్రతీ పని.. బీజేపీ పెద్దల నుంచి వచ్చిన స్క్రిప్టేననేది రాజకీయవర్గాల్లో ఉన్న ప్రచారం. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లాలని చాలాకాలం క్రితమే నిర్ణయించుకున్నారని ప్రచారం. కానీ ఊరికే వెళ్తే ఎలా..? అందుకే కండువా కప్పుకునేలోపు హస్తానికి ఎంతో కొంత డ్యామేజీ చేసిరావాలని బీజేపీ (Bjp Trishula vyuha)పెద్దలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకే చాలా కాలం పాటు కాంగ్రెస్ పై విమర్శలు చేసి ఆ తర్వాత వన్ ఫైన్ డే కమలం గూటికి చేరారు రాజగోపాల్ రెడ్డి.

అలాగే వెంకటరెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నానని అంటున్నారు. కానీ ఆయన కూడా పార్టీని డ్యామేజీ చేసే పనులు, కేడర్ ను కన్ఫ్యూజ్ చేసే పనులు తప్ప వేరే చేసినట్టుగా కనిపించడం లేదు. ఒకరితర్వాత మరొకరిపై ఫిర్యాదులతో ఆయన కూడా తమ్ముడి రూట్లోనే వెళ్తున్నారు.

ఇలా మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ లో  ఒకరిని బీజేపీలో చేర్చుకుని.. మరొకరిని కాంగ్రెస్ లోనే ఉంచి కాంగ్రెస్ కన్ను పొడిపిస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అటు బీజేపీ నుంచి నేరుగా చేసే విమర్శలు ఉండనే ఉన్నాయి.

అయితే ఇంత జరుగుతున్నా ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.