Bathukamma : మన బతుకమ్మ ఇట్ల ఎందుకైంది..?
Latest Telangana

Bathukamma : మన బతుకమ్మ ఇట్ల ఎందుకైంది..?

bathukamma culture ruining : బతుకమ్మ పండుగ మన తెలంగాణ అస్తిత్వం. మన జీవనవిధానం.. మన కట్టు.. మన బొట్టు.. మన యాస.. మన భాష. తెలంగాణ ఆడిబిడ్డలు ఏడాదంతా ఎదురుచూసే పండుగ బతుకమ్మ. తల్లిగారింటికొచ్చి సుట్టాలను కలిసి, అవ్వయ్యతోని అన్నదమ్ములతోని సంబురంగ చేసుకునే పండుగ మన బతుకమ్మ.

మనకు బతుకునిచ్చే అమ్మ మన బతుకమ్మ(bathukamma). పొద్దూకేటప్పుడు బతుకమ్మ తాంబాళాన్ని నెత్తిల వెట్టుకుని.. మాదిగోళ్లు డప్పు సప్పుడు చేయంగనే ఈ కులం.. ఆ కులమని లేకుంట.. ఒకలెన్క ఒగలు.. తొవ్వవట్టి పోయేటోళ్లు. మా కులం పెద్దది మేం ముంగట నడ్వాలె అంటుంటరు శాన మంది.. కని బతుకమ్మలకు ఊరందరి కంటే ముంగట నడ్సేది మాదిగోళ్లే. ఆళ్ల డప్పు సప్పుడైతెనే బతుకమ్మలు ఇంట్లకెళ్లి బైటికచ్చేటియి.

ఒక్కో సందిలకెళ్లి ఒక్కో గుప్పు వచ్చి నాలుగు బజార్ల కాడ అందరు కూడి.. ఊరు ఊరంత వాగు ఒడ్డుకో.. శెర్వు ఒడ్డుకో పోయి బతుకమ్మలాడేది. కులం గిలం ముచ్చట లేకుంట.. ఏ వాడకట్టోళ్లు.. ఆ వాడకట్టు అన్నట్లు.. ఒక్కకాడ బతుకమ్మలు వెట్టి.. వాటి మీద దీపం పెట్టి.. చుట్టు తిరుగుకుంట బతుకమ్మ ఆడితే ఇంద్రధనస్సు భూమి మీదికి దిగచ్చినట్టు ఉంటది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. అని పాడుతాంటే.. ఎంత తోపు మ్యూజిక్ డైరెక్టర్ సుత పనికి రాడని పిస్తది.

చప్పట్లు కొట్టుకుంట.. ఒక అడుగు ముంగటికి.. ఉంకో అడుగు వెనకకు వేసుకుంట.. జెర్రంత నడుం ముంగటి వంచి ఓ సారి.. నిలవడి మల్లోపారి సప్పట్లు కొట్టుకుంట బతుకమ్మల సుట్టు ఆడోళ్లు తిరుగుతాంటే.. సన్నగా వీస్తున్న గాలి సప్పుడు.. చప్పట్ల సప్పుడు.. ఉయ్యాల పాటలకు సంగీతం లెక్కనే ఉండేటియి.

పొద్దూకినంక.. శిన్నగా అస్తున్న వెన్నెల వెలుగుల్ల ఒగలకు ఒగలకు సత్తు ముద్దలు పంచుకునేది. టిఫిన్ డబ్బాల్ల పెట్టి తీస్కపోయిన సత్తు ముద్దలు తిని వాగు శెలిమెల్ల నీళ్లు తాగి ఇంటి తొవ్వ వట్టేది.

..

కని మన బతుకమ్మకు ఏమైంది.? ఎందుకిట్ల చేస్తున్నం.? పేరు బతుకమ్మదే.. కని మనం చేస్తున్నదేంది.? ఉయ్యాట పాటలు ఏడవోయినయ్.?

మన బతుకమ్మ ఆటకు ఓ ప్రత్యేకత ఉంది. లయబద్ధంగా ఆడుతూ.. ఉయ్యాల పాటలు పాడే సంప్రదాయముంది. కానీ ఇయ్యాల్ల చేస్తున్నదేంది.?

అప్పట్ల నాలుగైదు గుంపులుగ జేరి బతుకమ్మ ఆడుతున్నా.. ఎక్కడ సుత గడబిడ, ఆగమాగం ఎగురుడులు దుంకుళ్లు ఉండకపోయేటియి.

బతుకమ్మ పండుగంటే యూట్యూబుల పాటలు విడుదల చేసి పైసలు సంపాయించుకుడైంది.

బతుకమ్మ పండుగంటే సౌండ్ బాక్సుల్ల డీజే పాటైంది.

బతుకమ్మ పండుగంటే కోలాటమైంది.

బతుకమ్మ పండుగంటే ఉత్తరభారతదేశపోళ్లు ఆడే దాండియా ఆట అయింది.

బతుకమ్మ పండుగంటే సిన్మా పాటలు పెట్టుకుని ఎవలకు ఇష్టమచ్చినట్టు వాళ్లు ఎగురు దుంకుడైంది.

ప్రతీ ప్రాంతానికి ఓ అస్తిత్వం ఉంటంది. దాండియా అంటే పలానా ప్రాంతమోళ్లు ఆడే ఆట. బతుకమ్మ అంటే పలానా తెలంగాణోళ్ల పండుగ. దానికి ఓ పద్ధతి ఉంటది. ప్రాముఖ్యత కూడ ఉంటది.

కని మనం ఏం చేస్తున్నం.? మన సంప్రదాయాన్ని మనమే మంట్లె గలుపుతున్నం. భక్తితోని ఉయ్యాల పాటలు పాడాల్సిన బతుకమ్మ ముంగట.. డీజే పాటలు పెట్టుకుని.. దుమ్ము దుమ్ము ఎగురుతున్నం. ఎవ్వలైనా ఆళ్ల ప్రాంతం గొప్పదనాన్ని.. ప్రాశస్త్యాన్ని కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తరు. మనం బతుకమ్మ పండుగనే పేరును కాపాడుకుంటున్నం.

కని.. మన పండుగ స్వరూపాన్ని మార్చేసినం. తంగేడు, గునుగు,పట్టుకుచ్చుల పూలు కనిపిస్తలెవ్. కాగితం పూల బతుకమ్మలు పెరుగుతున్నయ్. ఉయ్యాల పాటలు పోయినయ్. చప్పట్లతోని లయబద్ధంగా ఆడే ఆటలు పోయినయ్. ఎక్కడ్నో మారుమూలల్లో ఉండే పల్లెలను కూడా డీజే పాటలు కలుషితం చేసినయ్. బతుకమ్మ పండుగ(batukamma) తరీఖాను పూర్తిగ మార్చేసినయ్.

Read Also :