BRS : గులాబీ బాస్ కత్తి నూరుతున్నది అందుకేనా..?
Latest Telangana

BRS : గులాబీ బాస్ కత్తి నూరుతున్నది అందుకేనా..?

back stabbers in BRS : రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం సభ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. భారత రాష్ట్ర సమితి ప్రకటించాక.. భారీ బహిరంగ నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే.. ఇది పార్టీ కార్యక్రమం కాదు. అధికారిక కార్యక్రమంగానే తెలుస్తోంది. రెండో విడత కంటి వెలుగు స్కీంను ఈ వేధికగా కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. తద్వారా తెలంగాణ సంక్షేమాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఖమ్మం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే సమయంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారుకు గుడ్ బై చెప్పేందుకు దాదాపు రెడీ అయ్యారు. రోజు రోజుకు ఆయన చర్యలు చూస్తే కారుతో తెగదెంపులు చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.

Read Also :

సరిగ్గా ఖమ్మంలో కేసీఆర్ (BRS) సభ రోజే పొంగులేటీ బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. దీని ద్వారా కేసీఆర్ కు తాము షాకిచ్చామని.. కేసీఆర్ భారీ సభ పెట్టిన రోజే ఆ పార్టీ మాజీ ఎంపీని బీజేపీలోకి తీసుకున్నామనే సంకేతాలిచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేసినట్టు సమాచారం. సోమవారం, మంగళవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలున్నాయి. అవి ముగియగానే 18న పొంగులేటికి ఢిల్లీలో కాషాయ కండువా కప్పే కార్యక్రమం ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి.

అయితే.. బీజేపీ ప్రణాళిక ఏంటో తెలిసి కూడా కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఖమ్మం జిల్లాలో పొంగులేటికి మంచి ఫాలోయింగే ఉంది. గతంలో వైసీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయినా పార్టీ మంచి ప్రయారిటీనే ఇచ్చింది. అయితే దీన్ని ఆయన దుర్వినియోగం చేశారని అందుకే కేసీఆర్ ఆయన్ను దూరం పెట్టారని చాలాకాలంగా జరుగుతున్న చర్చ.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ లీడర్ పార్టీ నుంచి వీడినా రాబోయే ఎన్నికల్లో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న వ్యక్తి దూరమైతే అది చాలా నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల (BRS) విజయావకాశాలను దెబ్బతీస్తుంది. ఇదంతా తెలిసినా.. కేసీఆర్ ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారని ఆ పార్టీ నేతలు  మాట్లాడుకుంటున్నారు.

దీనికి బలమైన కారణమే ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. నమ్మకంగా ఉన్న వ్యక్తులకు కేసీఆర్ ఎంతలా అవకాశాలిస్తారో… వెన్నుపోటు పొడిచిన వారిని, పొడిచేందుకు ప్రయత్నించిన వారిని అంతే దూరంగా పెడతారని.. అందులో భాగంగానే పొంగులేటిని దగ్గరకు రానివ్వడం లేదంటున్నారు.

back stabbed leaders in BRS

గతంలో మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఇతర నేతలకు వ్యతిరేకంగా ఇతర పార్టీల్లో వర్గాలను ప్రోత్సహించారని సమాచారం. ఏకంగా మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ నే ఓడించేందుకు కుట్ర చేశారని అందుకే ఆయన్ను కేసీఆర్ దూరంగా పెట్టారని టాక్.

తర్వాత ఈటల రాజేందర్ కూడా రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. సెక్యూరిటీని వదిలిపెట్టి తెల్లవారుజామునే బయటకు వెళ్లి ఇతర పార్టీల నేతలతో సమావేశమైనట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన్ను బయటకు పంపేశారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోవడానికి కారణమయ్యారనే ఆరోపణలున్నాయి. టీఆర్ఎస్ లో ఉంటూ.. సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచారని అందుకే ఆయనకు చాలా కాలం క్రితమే ప్రగతిభవన్ ఎంట్రీ రద్దయ్యిందని రాజకీయవర్గాల్లో టాక్.

రాబోయే రోజుల్లో ఏ లీడరైనా ఇలా పార్టీకి నష్టం కలిగించేలా..? కట్టప్ప వ్యవహారాలు నడిపిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దీని ద్వారా సంకేతాలు కూడా ఇస్తున్నారని చర్చ నడుస్తోంది. కట్టప్పలు ఎంతమంది వచ్చినా.. త్రిశూల వ్యూహంతో తిప్పి కొడతానని సన్నిహిత వర్గాలతో కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది.

Read Also :