Allipoola Vennela: ఏఆర్ రహమాన్ కొండంత రాగం సరే.. మన వాసనేది పాటలో..?
Latest Telangana

Allipoola Vennela: ఏఆర్ రహమాన్ కొండంత రాగం సరే.. మన వాసనేది పాటలో..?

Allipoola Vennela AR Rahman batukamma song:

బతుకమ్మ అంటే పల్లెటూరి వాతావరణం..

బతుకమ్మ మాదిగ డప్పు సప్పుడు.. ఆడపడుచుల చప్పట్ల సంగీతం..

బతుకమ్మ అంటే తెలంగాణ పేదోడి బతుకుచిత్రం..

కానీ.. బతుకమ్మ పాటల పేరుతో బతుకమ్మ ఆటలోని జీవాన్ని చంపేస్తున్నారు. గంగ పూర్తిగా చంద్రముఖిగా మారిందన్నట్టుగా.. బతుకమ్మ పాట పూర్తిగా కమర్షియల్ అయిపోయింది.

నిన్న మొన్నటి వరకు డీజేలు, రీమిక్సులు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా.. అందులోని పల్లెపదాల పరిమళం.. మరీ ముఖ్యంగా తెలంగాణ భాష, యాస.. వింటే కడుపునిండినట్టు అనిపించేది.

కానీ ఇప్పుడేం జరిగింది. బతుకమ్మ పాటకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన వాళ్లే ఆ అస్తిత్వాన్ని చంపేస్తున్నట్టు అనిపిస్తోంది.

ఏఆర్ రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ డైరెక్షన్ అని కొండంత రాగం తీసి.. పనికిమాలిన పాట పాడినట్టుగానే ఉంది. ఎంత అంతర్జాతీయ స్థాయి వ్యక్తులతో చేయించినా.. దానిలోని జీవం పోకుండా చూడాలి. బతుకమ్మ పండుగ సందర్భంగా అనాదిగా వస్తున్న సంప్రదాయాలను భావితరాలకు చాటిచెప్పేలా ఉండాలి.

సంప్రదాయ వాయిద్యాల శబ్దం మనసుకు ఇంపుగా ఉండేది. డప్పు దరువు వినబడగానే కాళ్లు వాటంతట అవే స్టెప్పులేసేవి. కానీ ఈ పాట చూస్తే ఓ సినిమా పాట చూసినట్టుగా ఉంది తప్పితే.. అది బతుకమ్మ పండుగ పాటలా మాత్రం అనిపించలేదు.

మొన్నటి దాకా డీజే పాటలతో దిగజార్చారు. ఇప్పుడు కూడా కుప్పలు తెప్పలుగా డీజే పాటలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాటిక్ పాటలతో భావితరాలకు మనం ఎలాంటి సంప్రదాయాలను నేర్పిస్తున్నామనేది.. ఒకసారి ఈ పాటలు చిత్రీకరిస్తున్న వాళ్లు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది.

Read Also :